సంక్రాంతి పండుగ వేళ పర్యావరణానికి, పక్షులకు హాని కలిగించే నిషేధిత చైనీస్ మాంజా విక్రయాలను అరికట్టేందుకు హైదరాబాద్ నగర పోలీసులు విస్తృత చర్యలు చేపట్టారు. నగర కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో పెద్ద ఎత్తున నిషేధిత మాంజాను స్వాధీనం చేసుకున్నారు. పర్యావరణానికి, మనుషుల ప్రాణాలకు హాని కలిగించే ‘చైనీస్ మాంజా’పై ప్రభుత్వం సంపూర్ణ నిషేధం విధించింది, నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ కొందరు గుట్టుచప్పుడు కాకుండా వీటిని విక్రయిస్తున్నారని పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. నగరంలో ఎవరైనా చైనా మాంజాను విక్రయించినా, గోదాముల్లో నిల్వ చేసినా, అక్రమ రవాణాకు పాల్పడినా ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు.
దుకాణాల్లో తనిఖీలు ముమ్మరం చేయడంతో వ్యాపారులు ఆన్‌లైన్ లో అమ్ముతున్నారనే విషయం కూడా తమకు తెలిసిందన్నారు హైదరాబాద్ పోలీసులు. ఈ-కామర్స్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా వేదికగా సాగే క్రయవిక్రయాలపై 24 గంటల పాటు ప్రత్యేక నిఘా ఉంచామని వీసీ సజ్జనార్ తెలిపారు. ప్లాస్టిక్, గాజు పెంకులు, మెటాలిక్ కోటింగ్ ఉండే ఈ మాంజా వల్ల విద్యుత్ షాక్ కొట్టే ప్రమాదం ఉందని అన్నారు. అంతేకాకుండా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి సంప్రదాయ నూలు దారాలనే ప్రోత్సహించాలని కోరారు. ఎవరైనా మాంజా విక్రయిస్తే ‘డయల్ 100’ లేదా వాట్సాప్ నెంబర్ 94906 16555 కి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.