టపాసులు కాల్చడం నిషేధం.. ఉత్తర్వులు పాటించకపోతే కఠిన చర్యలు
భారతదేశం అంతట హై అలర్ట్ పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే.
By Medi Samrat
భారతదేశం అంతట హై అలర్ట్ పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జంట నగరాల్లో పోలీస్ ఉన్నతాధికారుల భద్రతా చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే టపాసులు పేల్చవద్దు అంటూ ఉత్తర్వులు జారీ చేసింది యంత్రాంగం. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ భద్రతా కారణాల దృష్ట్యా హైదరాబాద్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎవ్వరు కూడా టపాసులు కాల్చవద్దు అంటూ ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాల్చడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఉగ్రవాద కార్యకలాపాల నేపథ్యంలో ఇటీవల దేశవ్యాప్తంగా భద్రతా చర్యలు కట్టుదిట్టం చేసింది హోంశాఖ. అంతేకాకుండా సున్నితమైన ప్రాంతాలపై నిఘా పెట్టడం కూడా జరిగింది. ఇటువంటి సమయంలో టపాసులు పేల్చినచో ప్రజలు భయభ్రాంతులకు గురై అవకాశాలు ఉన్నాయి. అందుకే ఎవ్వరూ కూడా టపాకాసులు కాల్చవద్దు అంటూ సీపీ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా సైనిక కంటోన్మెంట్ ప్రాంతాలు, చుట్టుపక్కల ప్రాంతాలు.. బహిరంగంగా ప్రదేశాలలో బాణాసంచా కాల్చ డం నిషేధం విధించారు. ఈ ఫైర్ క్రాకర్స్ సౌండ్స్ ప్రజలను భయ భ్రాంతులకు గురి చేసే అవకాశం ఉన్నందున వీటిని నిషేధించడం జరిగింది. పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఫంక్షన్స్ లలో కూడా టపాసులు కాల్చడం నిషేధం.. ఎవరైనా సరే ఆదేశాలు పాటించకపోతే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుం టామని సీపీ వెల్లడించారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఆదేశాలు కొనసాగుతాయని సీపీ ఉత్తర్వుల్లో వెల్లడించారు.