సోషల్ మీడియాను కొందరు సక్రమంగా ఉపయోగిస్తుంటే మరికొందరు వీటి ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ స్కాంలు కూడా బాగా పెరిగిపోయాయి. ఈజీమనీకి అలవాటుపడ్డ కొందరు వివిధ రకాల మెసేజ్‌లతో బురిడీ కొట్టిస్తున్నారు. వాట్సాప్ వేదికగా జరుగుతున్న ఫ్రెండ్ ఇన్ నీడ్ అనే స్కామ్ సంచలనం కలిగిస్తోంది. మనకు తెలిసిన వాళ్ల నంబర్ల నుంచి సందేశాలు పంపుతూ ఎక్కడో ఇరుక్కుపోయామని, లేదా తామే కష్టాల్లో ఉన్నామని నమ్మబలికి డబ్బులు లాగేసిన ఉదంతాలు మనం చూశాం. తాజాగా మెడికల్ ఎమర్జెన్సీ అంటూ వాట్సాప్‌లో మెసేజ్‌లు పెడుతూ అందినకాడికి దండుకుంటున్న ఓ మహిళ గుట్టును హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు రట్టు చేశారు.
గుజరాత్ అహ్మదాబాద్‌కు చెందిన హేమలి అనే మహిళ ఇతర వ్యక్తుల ఫోటోలను వాట్సాప్ డీపీగా పెట్టుకునేది. ఆ వ్యక్తుల స్నేహితులకు మెడికల్ ఎమర్జెన్సీ అని చెప్పి డబ్బులు కావాలంటూ మెసేజ్‌లు పెట్టేది. తెలిసిన వారే ఆపదలో ఉన్నారని బావించిన వారు వెంటనే డబ్బులు పంపేవారు. ఇలాహైదరాబాద్‌కు గోల్కొండకు చెందిన లవ్లీన్‌కుమార్ అనే వ్యక్తి రూ.2లక్షల రూపాయలను పంపాడు. పదే పదే డబ్బులు అడుగుతుండడం.. తాను మోసపోయానని గ్రహించిన అతడు పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసును నమోదు చేసుకున్న సైబర్ క్రైం పోలీసులు అకౌంట్ డీటెయిల్స్ ఆధారంగా హేమాలి ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.