విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన హైదరాబాద్ మెట్రో

Hyderabad Metro announces student pass. హైదరాబాద్ మెట్రో విద్యార్థుల సౌకర్యార్థం స్టూడెంట్ పాస్-2023ని ప్రకటించింది.

By Medi Samrat  Published on  1 July 2023 9:25 PM IST
విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన హైదరాబాద్ మెట్రో

హైదరాబాద్ మెట్రో విద్యార్థుల సౌకర్యార్థం స్టూడెంట్ పాస్-2023ని ప్రకటించింది. వేసవి సెలవుల అనంతరం విద్యాసంస్థలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థుల కోసం కొత్తగా స్టూడెంట్ పాస్ అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్ కార్డ్ రూపంలో ఇది అందుబాటులో ఉండనుంది. ఈ పాస్ కోసం విద్యార్థులు 20 ట్రిప్పుల మొత్తాన్ని చెల్లించి 30 రోజుల్లో 30 రైడ్‌లు చుట్టేయచ్చు. ఈ పాస్ వ్యాలిడిటీ 9 నెలలు. అంటే.. జూలై 1, 2023 నుంచి మార్చి 31, 2024 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైల్ తన అధికారిక హ్యాండిల్ ద్వారా వెల్లడించింది.

విద్యార్థులు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెడ్ లైన్ - JNTU కళాశాల, SR నగర్, అమీర్‌పేట్, విక్టోరియా మెమోరియల్, దిల్‌‌షుఖ్ నగర్ గ్రీన్ లైన్ - నారాయణగూడ, బ్లూ లైన్ - నాగోల్, పరేడ్ గ్రౌండ్స్, బేగంపేట్ మరియు రాయదుర్గ్ వద్ద పాస్‌లను కొనుగోలు చేయవచ్చని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు వారి వారి కళాశాల ఐడి కార్డ్‌ చూపించి స్టూడెంట్ పాస్ మెట్రో కార్డ్‌ను పొందవచ్చు. ఈ ఆఫర్ 1 జూలై 2023 నుంచి 31 మార్చి 2024 వరకు తొమ్మిది నెలల పాటు అందుబాటులో ఉంటుంది. ఒక్కో విద్యార్థికి ఒక స్మార్ట్ కార్డ్ మాత్రమే జారీ చేయబడుతుంది. 1 ఏప్రిల్ 1998 తర్వాత జన్మించిన విద్యార్థులు పాస్ పొందేందుకు అర్హులు. ఈ ఆఫర్ పరిమిత కాలం పాటు అందుబాటులో ఉంటుంది.


Next Story