హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) తాగునీటిని వృథా చేసిన వ్యక్తికి రూ.10,000 జరిమానా విధించింది. బంజారాహిల్స్‌లో నివాసముంటున్న వ్యక్తి కారు, బైక్ కడుక్కోవడానికి తాగునీరు వాడుతున్నాడు. హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఎండీ అశోక్‌రెడ్డి బుధవారం రోడ్డు నెంబరు 12 గుండా వెళుతుండగా తాగునీటి వృథా చేసే విషయం వెలుగులోకి వచ్చిందని టీఓఐ నివేదించింది. ఎండీ పరిశీలనతో విచారణ చేపట్టగా సదరు వ్యక్తి వాహనాలు కడుక్కోవడానికి తాగునీటిని వాడుతున్నట్లు తేలింది. నిర్ధారణల ఆధారంగా అతనికి రూ.10,000 జరిమానా విధించారు.
అదే ప్రాంతంలో మరో వ్యక్తి కూడా తాగునీటిని వృథా చేశాడు. అతని నిర్లక్ష్యం కారణంగా సంపు పొంగిపొర్లడంతో దాదాపు కిలోమీటరు మేర నీరు రోడ్డుపై ప్రవహించింది.
ఈ ఏడాది మార్చి నెలలో హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో కూడా ఇదే తరహాలో తాగునీటి వృథా ఘటన చోటుచేసుకుంది. ఆ విషయమై తాగునీరుతో కారును కడిగినందుకు నివాసికి రూ.1000 జరిమానా విధించబడింది. ఈ సంఘటనల దృష్ట్యా తాగునీటి వృధాపై హైదరాబాద్ వాసులను HMWSSB హెచ్చరించింది.