కేబుల్ బ్రిడ్జిపై ఫ్రెండ్‌ పుట్టినరోజు వేడుకకు హాజ‌రైన ఎస్సై.. విచారణకు ఆదేశించిన డీసీపీ

హైదరాబాద్ లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై బర్త్ డే పార్టీలు చేసుకోవద్దని పోలీసులు ఎన్నో సార్లు ప్రజలకు సూచించారు. పోలీసుల సూచనలు పట్టించుకోని వారిపై కేసులు కూడా నమోదు చేశారు.

By Medi Samrat  Published on  6 May 2024 3:37 PM IST
కేబుల్ బ్రిడ్జిపై ఫ్రెండ్‌ పుట్టినరోజు వేడుకకు హాజ‌రైన ఎస్సై.. విచారణకు ఆదేశించిన డీసీపీ

హైదరాబాద్ లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై బర్త్ డే పార్టీలు చేసుకోవద్దని పోలీసులు ఎన్నో సార్లు ప్రజలకు సూచించారు. పోలీసుల సూచనలు పట్టించుకోని వారిపై కేసులు కూడా నమోదు చేశారు. అయితే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకకు హాజరైన మాదాపూర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జి. మల్లేష్ వివాదంలో చిక్కుకున్నారు. పుట్టినరోజు వేడుకల ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మాదాపూర్ DCP, G. వినీత్, విచారణకు ఆదేశించారు.

మాదాపూర్ పోలీసులు వంతెనపై పుట్టినరోజులు జరుపుకోవద్దని ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నారు. ఉల్లంఘించిన వారిపై రూ.1000 జరిమానా కూడా విధిస్తామని ప్రకటించారు. ప్రధాన రహదారిపై వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల ఏర్పడే భారీ ట్రాఫిక్ జామ్‌లను నివారించడానికి వంతెనపై వేడుకలను నిషేధించారు. హైదరాబాద్‌లోని దుర్గం చెరువు వంతెనపై తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకకు ఇన్‌స్పెక్టర్ హాజరైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ నియమం సామాన్య ప్రజల కోసం మాత్రమేనా అని సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఈ వివాదం నేపథ్యంలో.. ప్రధాన రహదారిపై కాకుండా బ్రిడ్జి ఫుట్‌పాత్‌పైనే బర్త్ డే వేడుక జరిగిందని పోలీసు ఇన్‌స్పెక్టర్ స్పష్టం చేశారు. ఫుట్‌పాత్‌పైనే వేడుక జరిగినా.. సీఐ కావడంతో మరింత జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని డీసీపీ అభిప్రాయపడ్డారు. ఇన్‌స్పెక్టర్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు.

Next Story