హైదరాబాద్ నగరంలోని నాన్ వెజ్ లవర్స్ కు షాకింగ్ న్యూస్ ఇది. ఆదివారం నాడు నాన్ వెజ్ షాపులన్నీ మూతపడనున్నాయి. ఆదివారం రోజు నాన్ వెజ్ వంటకాలు వండుకునే వారికి ఇది నిజంగానే చేదు వార్త. ఈ ఆదివారం (ఏప్రిల్ 21) హైదరాబాద్‌లో ఎక్కడా నాన్ వెజ్ అందుబాటులో ఉండదు.. ఆ రోజు చికెన్, మటన్ షాపులన్నీ మూసివేయనున్నారు. జైన్ సమాజం ఆచరించే మహావీర్ జయంతి పండుగ సందర్భంగా హైదరాబాద్‌లోని అన్ని కబేళాలు, మాంసం దుకాణాలను మూసివేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఇప్పటికే ఆదేశించింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ ఆదేశాల మేరకు ఆదివారం ఎవరూ మాంసం విక్రయించకూడదు. తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
హైదరాబాద్ నగరంలో జైనులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో వారికి ఎంతో పవిత్రమైన మహావీర్ జయంతి రోజున నాన్ వెజ్ షాపులను మూసివేయాలని జీహెచ్ఎంసీ ఆంక్షలు విధించింది. నిబంధనలు ఉల్లంఘించి మాంసం విక్రయించే దుకాణ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ తెలిపారు. సోమవారం (ఏప్రిల్ 22) అన్ని కబేళాలు, మాంసం దుకాణాలు యథావిధిగా తెరవనున్నారు.