కిలోమీటరుకు రూ.14 నుంచి రూ.10కి తగ్గిన రైడ్ ఛార్జీల కారణంగా తమకు అన్యాయం జరుగుతోందని హైదరాబాద్ కు చెందిన క్యాబ్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గడంతో నగరంలో క్యాబ్ డ్రైవర్లు నిరసన ప్రకటించారు. ఈ తగ్గింపు ధరలు తమ జీవనోపాధిపై గణనీయమైన ఆర్థిక ఒత్తిడిని సృష్టించాయని క్యాబ్ డ్రైవర్లు వాపోయారు.
తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ (TGPWU) నేతృత్వంలోని నిరసనలు చేపట్టాలని భావిస్తున్నారు. ప్రధాన రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్‌లతో పనిచేసేటప్పుడు డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలియజేయనున్నారు.పెరుగుతున్న ఇంధన ధరలు, పెరుగుతున్న వాహన నిర్వహణ ఖర్చులతో పాటు ఛార్జీల తగ్గింపు ఆదాయాన్ని దెబ్బతీస్తున్నాయని డ్రైవర్లు వాదిస్తున్నారు. రైడ్ ఛార్జీలను నియంత్రించడం, కిలోమీటరుకు కనీస ఛార్జీని నిర్ణయించడం ద్వారా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని TGPWU కోరుతోంది.
ప్రస్తుతం ఉన్న ధరల నమూనా ప్రధానంగా అగ్రిగేటర్ కంపెనీలకు ప్రయోజనం చేకూరుస్తుందని, తగ్గిన ఆదాయాల భారాన్ని డ్రైవర్లు భరించవలసి ఉంటుందని డ్రైవర్లు వాపోతున్నారు.