Hyderabad: విదేశాల్లోని భారతీయ విద్యార్థులను మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్

యూనివర్సిటీ సెమిస్టర్ ఫీజు చెల్లింపుల్లో 10 శాతం రాయితీ ఇప్పిస్తానని చెప్పి మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

By అంజి  Published on  17 May 2024 12:04 PM GMT
Hyderabad, Andhra Pradesh, Indian students, cheating,  arrest

Hyderabad: విదేశాల్లోని భారతీయ విద్యార్థులను మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్

యూఎస్‌ఏలోని యూనివర్సిటీల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులను టార్గెట్‌గా చేసుకొని.. యూనివర్సిటీ సెమిస్టర్ ఫీజు చెల్లింపుల్లో 10 శాతం రాయితీ ఇప్పిస్తానని చెప్పి మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారని హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ కవిత వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చిందని డీసీపీ తెలిపారు. కనోళ్ల అశోక్ కుమార్(28) అనే వ్యక్తి తన స్నేహితుడు తరుణ్‌తో కలిసి ఈ మోసాలకు పాల్పడుతున్నాడు.

యూఎస్‌ఏలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులను సంప్రదించి సెమిస్టర్ ఫీజు చెల్లింపుల్లో 10 శాతం రాయితీ ఇప్పిస్తానని కల్లబొల్లి కబుర్లు చెప్పి విద్యార్థులను నమ్మించి వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నాడు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి.. నిందితుడు విజయ్ కుమార్ చెప్పిన మాటలు నమ్మి, తన కుమారుడు యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ ఫ్లోరిడా యూఎస్ఏలో చదువుతున్నాడు. అతని సెమిస్టర్ ఫీజ్ చెల్లింపులో 10% రాయితీ కావాలంటూ నిందితుడిని సంప్రదించాడు.

నిందితుడు అతనిని నమ్మించే విధంగా రకరకాల కారణాలు చెప్పి అతని వద్ద నుండి 4,38,599 లక్షల రూపాయలను వసూలు చేశాడు. అయినా కూడా సెమిస్టర్ ఫీజు చెల్లింపులో రాయితీ రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు66(సి), 419,420 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అశోక్ కుమార్ తన స్నేహితుడితో కలిసి ఈ మోసాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించిన పోలీసులు.. వెంటనే అశోక్ కుమార్‌ను అరెస్టు చేసి, అతని వద్ద నుండి సెల్ ఫోను స్వాధీనం చేసుకున్నారు.

Next Story