భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఏ క్షణంలోనైనా పేలుడు సంభవించవచ్చని హెచ్చరిస్తూ పాకిస్థాన్‌కు చెందిన స్లీపర్ సెల్ ఈమెయిల్ బెదిరింపు పంపినట్లు తెలుస్తుంది.
స్థానిక వార్తా నివేదికల ప్రకారం.. స్టాండర్డ్ సెక్యూరిటీ ప్రోటోకాల్‌లో భాగంగా టెర్మినల్ మరియు పరిసర ప్రాంతాలతో సహా విమానాశ్రయ ప్రాంగణమంతా అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అయితే బాంబు బెదిరింపు బూటకమని ఆ తర్వాత నిర్ధారించారు.
ఈమెయిల్ మూలాన్ని అధికారులు పరిశీలిస్తున్నందున రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం హై అలర్ట్‌లో ఉంది. మరోవైపు.. డిఆర్‌డిఓ సమీపంలోని సికింద్రాబాద్, గోల్కొండ, నాచారం, కంచన్‌బాగ్‌తో సహా నాలుగు కీలక ప్రదేశాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా సిబ్బందికి సహకరించాలని సూచించారు.
అంతకుముందు.. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) అన్ని విమానాలకు సెకండరీ లాడర్ పాయింట్ చెకింగ్ తప్పనిసరి చేసింది.. విమానాశ్రయాల టెర్మినల్ భవనాల వద్ద సందర్శకులను నిషేధించింది. మొత్తం భద్రతను మెరుగుపరిచింది. భద్రతా చర్యల దృష్ట్యా ప్రయాణికులు విమానాశ్రయాలకు త్వరగా చేరుకోవాలని సూచించింది. మరోవైపు దేశంలోని వివిధ ప్రాంతాల్లోని దాదాపు 27 విమానాశ్రయాలు మూతపడ్డాయి.