హైదరాబాద్ లో బయటపడ్డ దీపం వత్తుల స్కామ్.. రూ.250 కోట్ల గోల్ మాల్
Huge Fraud in Hyderabad. హైదరాబాద్ లో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 28 Nov 2022 5:50 PM ISTహైదరాబాద్ లో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. దీపం వత్తులు, బొట్టు బిల్లల పేరుతో ఏకంగా రూ.250 కోట్ల మోసం జరిగింది. దీపం వత్తుల తయారీకి యంత్రాలు, దూది తామే ఇస్తామని.. బొట్టు బిల్లల తయారీ యంత్రంతో పాటు.. ముడి సరుకులు మేమే ఇస్తామని ఎంతో మందిని బుట్టులో వేసుకున్న ఓ వ్యక్తి వందల కోట్లు మోసం చేశాడు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కుషాయిగూడలో ఈ భారీ మోసం వెలుగు చూసింది.
ఏఎస్ రావు నగర్‌కు చెందిన రమేష్ రావు అనే వ్యక్తి ఆర్‌ఆర్ ఎంటర్‌ప్రైజెస్ పేరుతో ఓ కంపెనీ ఏర్పాటు చేశాడు. దీపం వత్తులు, బొట్టు బిల్లల తయారీ యంత్రాలతో పాటు.. ముడి సరుకు తానే ఇస్తానని చెప్పాడు. తను ఇచ్చే ముడి సరుకు తయారు చేసి ఇస్తే డబ్బు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. కొంతకాలం ఈ వ్యవహారం సాగినా.. ఆ తర్వాత చెత్తులెత్తేశాడు. తాజాగా కంపెనీ బోర్డ్ తిప్పివేయడంతో లబోదిబోమంటున్నారు బాధితులు.
దీపం వత్తులు తయారీ పేరుతో రమేష్ సుమారు రూ.250 కోట్ల వరకూ మోసం చేశాడు. సుమారు 1500 మంది వరకు మోసపోయినట్లు తెలుస్తోంది. దీపం వత్తుల తయారీకి యంత్రాలు ఇప్పిస్తానంటూ చాలామందికి మాయమాటలు చెప్పాడు. ఇది నిజమేనని నమ్మిన కొంతమంది దీపం వత్తులు తయారు చేసే యంత్రాలను రమేష్ రావు వద్ద నుంచి కొనుగోలు చేశారు. ఒక్కొక్కరి వద్ద నుండి దాదాపు రూ.5 నుండి 10 లక్షల వరకూ వసూలు చేశాడు. దీపం వత్తుల మెషీన్లతో దూది వత్తులు తయారు చేసి ఇచ్చిన ఏ ఒక్కరికి కూడా రమేష్ రావు డబ్బు ఇవ్వలేదు. డబ్బులు అడిగితే ఇవాళ, రేపు ఇస్తానంటూ గత ఆరు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. రమేష్ రావును నిలదీయడంతో కొద్దిసేపు ఆగండని చెప్పి.. కంపెనీ వెనుక దారి నుంచి తప్పించుకుని పారిపోయాడని చెబుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ కుషాయిగూడ పోలీసులను బాధితులు ఆశ్రయించారు.