ఆ రైల్వే గేటు మూసివేత.. 6000 కుటుంబాలకు ఇబ్బందులు
How Safilguda Railway Gate Closure Increase Travel Distance 3 km. భద్రతా కారణాల దృష్ట్యా సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) సఫిల్‌గూడ రైల్వే గేట్‌ను మూసివేయడంతో
By న్యూస్‌మీటర్ తెలుగు
భద్రతా కారణాల దృష్ట్యా సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) సఫిల్‌గూడ రైల్వే గేట్‌ను మూసివేయడంతో 6000 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సఫిల్‌గూడ రైల్వే గేటు మూసివేతపై చర్చించేందుకు వివిధ కాలనీల నిర్వాసితులు సమావేశం నిర్వహించారు. భద్రతా కారణాల దృష్ట్యా 2021లో గేట్ మూసివేశారు.. దీంతో స్థానిక నివాసితులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమావేశంలో బలరాం నగర్, సీతారాం నగర్, దేవి నగర్, పశ్చిమ శ్రీకృష్ణానగర్, ఆదర్శనగర్, ఎల్బీనగర్, సైనిక్ నగర్, న్యూ విద్యానగర్, రామకృష్ణాపురం బస్తీ కాలనీల ప్రతినిధులు పాల్గొన్నారు. బలరాం నగర్ - సీతారాం నగర్ రైల్వే ట్రాక్ సమీపంలో కొత్తగా ఆర్‌యూబీ (రోడ్ అండర్ బ్రిడ్జి) నిర్మించే అవకాశాలపై చర్చించారు. ఇదే జరిగితే 6000 కుటుంబాలకు రాకపోకల సమస్య తీరుతుంది.
సఫిల్‌గూడ రైల్వే గేట్‌ను తెరిపించేందుకు చేసిన ప్రయత్నాలను మల్కాజిగిరికి చెందిన ఫెడరేషన్ ఆఫ్ ఆర్‌డబ్ల్యూఏస్ అధ్యక్షుడు బిటి శ్రీనివాసన్ తెలిపారు. "సఫిల్‌గూడ స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌ల విస్తరణ చేస్తూ ఉండడంతో దక్షిణ మధ్య రైల్వే GM, హైదరాబాద్ డివిజన్ DRM గేటును తిరిగి తెరవడానికి నిరాకరించారు." అని తెలిపారు.
సమస్య:
కాలనీల ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. సఫిల్‌గూడ రైల్వేగేట్‌ను మూసివేయడంతో సఫిల్‌గూడ రైల్వేగేట్ నుంచి రామకృష్ణాపురం ఫ్లైఓవర్ మధ్య నివసిస్తున్న 6వేల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. ఆనంద్ బాగ్‌లో కొత్తగా నిర్మించిన జైన్ బాలాజీ నిలయం కాసా వాటర్‌సైడ్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌కు సంబంధించిన అప్పగింత ప్రక్రియ ముగియడంతో సమస్య మరింత తీవ్రమవుతుంది. ఈ కుటుంబాలు అంబేద్కర్ విగ్రహం వద్దకు, ఆపై ఉత్తమ్ నగర్ ఆర్‌యుబి రోడ్డుకు వెళ్లాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.
బలరామ్ నగర్-సీతారామ్ నగర్ రైల్వే ట్రాక్ సమీపంలో కొత్త RUB నిర్మిస్తే సమస్య పరిష్కారమవుతుంది. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఎంపీ రేవంత్‌రెడ్డి, కార్పొరేటర్ ఎస్ శ్రవణ్ సహా స్థానిక నేతల సహకారంతో రైల్వే ఇంజినీరింగ్ శాఖ వెంటనే సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని కోరారు.
నివాసితులకు భరోసా ఇస్తున్న కార్పొరేటర్, మాజీ కౌన్సిలర్
ఈ సమావేశంలో పాల్గొన్న స్థానిక మల్కాజిగిరి కార్పొరేటర్ ఎస్ శ్రవణ్ మాట్లాడుతూ.. ఈ విషయంలో పూర్తి సహకారం అందిస్తాను. ఈ విషయాన్ని నేను ఇప్పటికే కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ జి. కిషన్‌రెడ్డికి వివరించానని, ఈ విషయంపై మరోసారి రైల్వే జీఎంతో మాట్లాడాల్సిందిగా కోరతానన్నారు. దక్షిణ మధ్య రైల్వే GMని ఉద్దేశించి ఒక లేఖ కూడా తీసుకువస్తానన్నారు.
అల్వాల్ మాజీ కౌన్సిలర్, జీహెచ్‌ఎంసీ మాజీ కో-ఆప్టెడ్ సభ్యుడు నందికంటి శ్రీధర్ మాట్లాడుతూ.. ఈ సమస్యను ఎంపీ రేవంత్‌రెడ్డికి వివరించి సమస్యను వివరిస్తాను. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఢిల్లీలో రైల్వే మంత్రిని కలిసి ఈ సమస్యపై చర్చించి పరిష్కారానికి ఏర్పాట్లు చేయాలని కోరేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు.
గత మీటింగ్ లో:
ఇంతకు ముందు నిర్వహించిన సమావేశంలో.. వెస్ట్ కృష్ణానగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు డి రామకృష్ణ మాట్లాడుతూ, “సఫిల్‌గూడ రైల్వే గేట్‌ను మూసివేయడం వల్ల వివిధ కాలనీల వాసులు చాలా అసౌకర్యానికి గురయ్యారు. ప్రయాణ దూరం మూడు కిలోమీటర్లు పెరిగింది. విజయ డయాగ్నోస్టిక్స్ వైపు నుండి ఉత్తమ్ నగర్ RUB వరకు వెళ్లే రహదారి చాలా ఇరుకైనది, ప్రమాదకరమైనది." అని అన్నారు. గతంలో ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్నాయని చెప్పుకొచ్చారు.
సీతారాంనగర్ సంఘం ప్రధాన కార్యదర్శి సంతోష్, కోశాధికారి రమేష్, బలరాం నగర్ సంఘం సభ్యుడు గోపాల్ సింగ్, సురేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ సఫిల్‌గూడ రైల్వేగేట్‌ను మూసివేయడంతో పనికి వెళ్లాలన్నా.. పిల్లలు పాఠశాలలకు రాకపోకలు సాగించాలన్నా చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సీతారాం నగర్ మధ్యలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు పశ్చిమ కృష్ణానగర్ కార్యదర్శి బి.బాలకృష్ణ మరో రైల్వే రెయిన్ వాటర్ డ్రెయిన్ ను సూచించారు. సబర్బన్ బస్ అండ్ ట్రైన్ ట్రావెల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నూర్ మాట్లాడుతూ.. సీతారాం నగర్ కల్వర్ట్ దగ్గర నుంచి రైల్వే ట్రాక్‌కు అవతలివైపు ఉన్న సఫిల్‌గూడ గేట్ వరకు రైల్వే వర్షపు నీటి కల్వర్టు కింద రోడ్డును అభివృద్ధి చేయడమే సమస్యకు పరిష్కారమని చెప్పుకొచ్చారు. తమ ప్రాంత వాసుల సమస్య తీరడానికి ఎన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు పడుతుందో అని స్థానికులు వాపోతున్నారు.