హైదరాబాద్‌లో చ‌ల్ల‌బ‌డ్డ వాతావ‌ర‌ణం.. మ‌రో నాలుగైదు రోజులు ఇదే ప‌రిస్థితి..!

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలలో ఊహించని విధంగా వర్షం కురిసి వాతావ‌ర‌ణం చల్లగా మారింది.

By Medi Samrat  Published on  26 Dec 2024 9:15 PM IST
హైదరాబాద్‌లో చ‌ల్ల‌బ‌డ్డ వాతావ‌ర‌ణం.. మ‌రో నాలుగైదు రోజులు ఇదే ప‌రిస్థితి..!

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలలో ఊహించని విధంగా వర్షం కురిసి వాతావ‌ర‌ణం చల్లగా మారింది. దీంతో భారత వాతావరణ శాఖ (IMD) ఉదయం వేళల్లో పొగమంచుతో కూడిన వాతావరణంతో ఆకాశం సాధారణంగా మేఘావృతమైన ఆకాశం ఉంటుందని అంచనా వేసింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం లేదా చినుకులు పడే అవ‌కాశం ఉంద‌ని.. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 25 డిగ్రీల సెల్సియస్, 20 డిగ్రీల సెల్సియస్‌గా ఉండవచ్చని అంచ‌నా వేసింది.

చార్మినార్‌, ఖైరతాబాద్‌, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్‌, సికింద్రాబాద్‌, శేరిలింగంపల్లి సహా కీలక మండలాల్లో రానున్న ఐదు రోజుల పాటు తేలిక‌పాటి వర్షపాతం న‌మోద‌వుతుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ ఇప్ప‌టికే అంచ‌నా వేసింది.

మేఘావృతమైన పరిస్థితుల కారణంగా హైదరాబాద్‌లో వరుసగా రెండో రోజు కూడా ఎండ క‌నిపించ‌లేదు. రోజంతా ఏదో ఒక ప్రాంతంలో చినుకులు పడుతూనే ఉన్నాయి. IMD హైదరాబాద్ అంచనాల ప్రకారం.. తేలికపాటి వర్షాలు లేదా చినుకులు కురుస్తాయని.. నగరవాసులు తమ ప్రయాణాన్ని తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచించింది.

ఇదిలావుంటే.. హైదరాబాద్‌తో పాటు సిద్దిపేట, వనపర్తి, వికారాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, కరీంనగర్ జిల్లాలతో సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులలో భాగంగా ఈ ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై అడపాదడపా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేసింది.

Next Story