హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి వర్షం భారీగా కురిసింది. ముషీరాబాద్, సికింద్రాబాద్, బేగంపేట సర్కిల్‌లో భారీ వర్షం కురిసింది. ముషీరాబాద్ సర్కిల్‌లో 18.4 సెంటీమీటర్లు వర్షపాతం నమోదు అయింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గచ్చిబౌలి, కూకట్‌పల్లి, అమీర్‌పేట్ ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు చేరింది. దీంతో ట్రాఫిక్ సమస్యలతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
ఇక రాజ్ భవన్ రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లో మోకాలి లోతు నీరు నిలవడంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. కాగా వరద ప్రాంతాల్లో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి పర్యటించారు. నాలాల్లో చెత్త వేయడంతో సమస్యలు తలెత్తుతున్నాయి అని మేయర్ తెలిపారు. భారీ వర్షాల కారణంగా వాటర్ లాగిన్ పాయింట్ల వద్ద నీటిని తోడేందుకు మోటార్లతో ఎమర్జెన్సీ టీమ్స్ రంగంలోకి దిగాయి. రోడ్లపై వరద నీటినీ ఎప్పటికప్పుడు తొలగించి హైడ్రా, జిహెచ్ఎంసి, పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ క్లియర్ చేశారు. నేడు కూడా నగరవ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో సిటీ ప్రజలుఅప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.