భాగ్యనగరం భారీ వర్షంతో తడిసిముద్దైంది. దీంతో నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఖైరతాబాద్ విద్యుత్ సౌధ, కేసీపీ, సీఈవో, నిమ్స్ నుంచి పంజాగుట్ట వైపు ట్రాఫిక్ జామ్ అయింది. శ్రీ నగర్ కాలనీ, సుల్తాన్ ఉలూమ్ కళాశాల, చట్నీస్, ఎన్‌ఎఫ్‌సీఎల్ నుంచి పంజాగుట్ట వైపు నెమ్మదిగా వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పంజాగుట్ట పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
మేడ్చల్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుంది.. ఘట్‌కేసర్, అన్నోజిగూడ, పోచారం, నారపల్లి, బోడుప్పల్ పీర్జాదిగూడ పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. నిజాంపేట, బాచుపల్లి, ప్రగతినగర్ కూకట్ పల్లి, ఏఎన్‌టీయూ, మూసాపేట్, జగద్గిరిగుట్ట పలు ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుంది. దీంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
కొండాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, మెహిదీపట్నం, కార్వాన్, గుడిమల్కాపూర్, మాసబ్ ట్యాంక్, టోలిచౌకి, నాంపల్లి, బషీర్బాగ్, అబిడ్స్, కోటి, సుల్తాన్ బజార్, బేగంబజార్, అంబర్‌పేట్ తదితర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం పడుతుంది. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలెర్ట్ ప్రకటించింది. నగరవాసులు అవసరం అయితేనే బయటకు రావాలని సూచించింది. సాధ్యమైనంత వరకూ ఇళ్లలోనే ఉండాలని నగర వాసులను కోరింది. ఎమర్జెన్సీ అయితే 040-21111111 లేదా 9000113667 లకు ఫోన్ చేయాలని సూచించింది.