హైదరాబాద్‌లో భారీ వర్షం.. పొంగిపొర్లులుతున్న డ్రైనేజీలు, పలు ప్రాంతాల్లో పవర్ కట్
Heavy Rain in Hyderabad Today.వేసవి కాలం ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. హైదరాబాద్
By తోట వంశీ కుమార్ Published on 4 May 2022 7:48 AM ISTవేసవి కాలం ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఫలితంగా నగరం ఒక్కసారిగా చల్లబడింది. ఉక్కపోతతో విసిగిపోయిన హైదరాబాద్ వాసులకు భారీ వర్షంతో కొంత ఊరట లభించింది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాలు జలమయం కాగా.. ఈదురుగాలుల కారణంగా పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా పలు చోట్ల విద్యుత్ శాఖ అధికారులు కరెంట్‌ను నిలిపివేశారు.
సికింద్రాబాద్ లోని సీతాఫల్మండి లో 7.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా బంసిలాల్ పేట్ లో 6.7 సెంటీమీటర్లు, వెస్ట్ మారేడ్ పల్లిలో లో 6.1 సెంటీమీటర్లు, అల్వాల్‌లో 5.9 సెంటీమీటర్లు, ఎల్బీ నగర్ లో 5.8 సెంటీమీటర్లు, గోషామహల్, బాలానగర్ లలో 5.4 సెంటీమీటర్లు, ఏఎస్ రావు నగర్ లో 5.1 సెంటిమీటర్లు, బేగంపేటలోని పాటిగడ్డ లో 4.9 సెంటీమీటర్లు, మల్కాజ్ గిరిలో 4.7 సెంటీమీటర్లు, సరూర్ నగర్, ఫలక్నామా లలో 4.6 సెంటి మీటర్లు, గన్ ఫౌండ్రీ లో 4.4 సెంటీమీటర్లు, కాచిగూడ, సికింద్రాబాద్ ల లో 4.3 సెంటీమీటర్లు, చార్మినార్ లో 4.2 సెంటీమీటర్లు, గుడిమల్కాపూర్ నాచారం లో 4.1 సెంటి మీటర్లు, అంబర్‌పేట్‌లో 4 సెంటీమీటర్లు, అమీర్‌పేట్, సంతోష్ నగర్ లలో 3.7 సెంటీమీటర్లు, ఖైరతాబాద్‌లో 3.6 సెంటీమీటర్లు, బేగంబజార్, హయత్ నగర్ లలో 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పంజాగుట్ట జంక్షన్ వద్ద భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. ఖైరతాబాద్, బంజారాహిల్స్ కూడలి వద్ద మోకాళ్ల లోతులో నీరు చేరింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఉపరితల ద్రోణి ప్రభావంతోనే వర్షాలు పడుతున్నాయని, నేడు, రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావావరణ శాఖ తెలిపింది.