సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో ప్రజలు హైదరాబాద్ మెట్రో రైల్ ఫ్లైఓవర్, చెట్ల కింద తలదాచుకున్నారు. 'రక్షాబంధన్' సందర్భంగా తమ బంధువుల ఇళ్లకు వెళ్తున్న అనేక కుటుంబాలు వర్షంలో చిక్కుకున్నాయి. అరగంట పాటూ వర్షం జోరున కురిసింది.
సికింద్రాబాద్, షేక్‌పేట తదితర ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. షేక్‌పేట వద్ద సెంట్రల్ మీడియన్‌కు ఇరువైపులా వర్షం నీరు చేరడంతో పాదచారులు నడుము లోతు నీటిలో నడవాల్సి వచ్చింది. ప్రధాన రహదారిపై చిక్కుకుపోయిన కారును క్రేన్‌తో ట్రాఫిక్ పోలీసులు పక్కకు లేపారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు మున్సిపల్ కార్మికుల సహకారంతో ప్రధాన రహదారులపై వర్షపు నీటిని తొలగించారు. అకస్మాత్తుగా కురిసిన వర్షం కారణంగా పూలు, పండ్లు, రాఖీలు విక్రయించే పలువురు వ్యాపారులు నష్టపోయారు. పాఠశాలలు, ప్రభుత్వ సంస్థలకు సెలవుదినం కావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తలేదు. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం సూచించడమే కాకుండా.. ఎల్లో అలర్ట్ ప్రకటించింది.