బుధవారం సాయంత్రం వేళ హైదరాబాద్ లో వర్షం కురిసింది. ఒక్క సారిగా వరుణుడు పలకరించడంతో భాగ్యనగరం చల్లబడింది. నగరంలో చాలా ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. హైదరాబాద్ లో పంజాగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, తార్నాక, లాలాపేట, ఓయూ, అంబర్ పేట, ఉప్పల్, సికింద్రాబాద్, గచ్చిబౌలి, మణికొండ, ఖైరతాబాద్, బోడుప్పల్ ప్రాంతాలలో వర్షం పడింది. నగరంలో మరికొన్ని ప్రాంతాలలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది.
రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతు పవనాలు విస్తరించే అవకాశం ఉండటంతో నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో జూన్ 21, 22 తేదీల్లో తెలంగాణ, దక్షిణ కోస్తా, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 25 నాటికి వాయువ్య బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడి ఒడిశా మీదుగా పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.