హైదరాబాద్‌లో భారీ వర్షం.. తడిసిముద్దైన మహానగరం
Heavy Rain fall in hyderabad.నైరుతీ రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా
By తోట వంశీ కుమార్ Published on 14 Jun 2021 5:13 AM GMTనైరుతీ రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌నూ భారీ వర్షం ముంచెత్తింది. తెల్లవారు జాము 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మసబ్ ట్యాంక్, మెహిదీపట్నం, అమీర్‌పేట్, యూసఫ్‌గూడ, క్రిష్ణానగర్, పంజాగుట్ట, బేగంపేట్, ఎర్రగడ్డ, కూకట్పల్లి, సికింద్రాబాద్, జీడిమెట్ల, పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులు జలమయం కావడంతో పలు చోట్ల వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
ఈ ఉదయం 7 గంటల వరకు సిరిసిల్లా జిల్లా రుద్రంగిలో 13.7సెం.మీ, జగిత్యాల జిల్లా జగ్గాసాగర్‌లో 12.8సెం.మీ వర్షపాతం నమోదైంది. తుఫాన్ ప్రభావంతో మరో 2 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. మరోవైపు వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్ తీరం, ఉత్తర ఒడిశా ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతున్నట్లు పేర్కొంది. దీనికి అనుబంధంగా మధ్య ట్రోపోస్పియర్ స్థాయి వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, మరో రెండు, మూడు రోజుల్లో మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఒడిశా, జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా వెళ్లే అవకాశం ఉందని తెలిపింది.