ఏప్రిల్ 23న హనుమాన్ జయంతి సందర్భంగా భజరంగ్ సేన మోటార్‌సైకిల్ ర్యాలీని నిర్వహించేందుకు అనుమతి లభించింది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి విజయసేన్ రెడ్డి.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్, ఈస్ట్ జోన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్‌ను ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
100 మోటార్‌సైకిళ్లతో ఊరేగింపు నిర్వహించేందుకు అనుమతి కోసం రిట్ పిటిషన్ దాఖలు చేసిన భజరంగ్ సేన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ఆర్ లక్ష్మణ్‌రావు అభ్యర్థనపై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రీ హనుమాన్ వ్యాయామ్ శాల వద్ద ప్రారంభమయ్యే ర్యాలీ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుంది. ఇది కెఎస్ లేన్‌లో కొనసాగి, సుల్తాన్ బజార్, రాంకోటి, నారాయణగూడ, చిక్కడపల్లి మీదుగా సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్ హనుమాన్ మందిర్ వద్ద ముగుస్తుంది. ర్యాలీకి సంబంధించి ధర్మాసనం కొన్ని కీలక సూచనలను చేసింది. ర్యాలీలో పాల్గొనేవారు DJ సిస్టమ్‌లను ఉపయోగించకూడదని.. రాజకీయ లేదా వివాదాస్పద ప్రకటనలు చేయడం మానుకోవాలని షరతులు విధించారు.