12 నుంచి ఆస్పత్రుల్లో ఉచిత భోజనం
Harish Rao inaugurates hospital equipments in Hyd. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రిలో రూ.2.15 కోట్ల విలువైన సీటీ స్కాన్‌ను
By Medi Samrat Published on 6 May 2022 9:37 AM GMTహైదరాబాద్‌లోని ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రిలో రూ.2.15 కోట్ల విలువైన సీటీ స్కాన్‌ను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్‌రావు శుక్రవారం ప్రారంభించారు. కోటి ఈఎన్‌టీ ఆస్పత్రిలో సమీకృత భవన సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి సీటీ స్కాన్‌ను ప్రారంభించారు. సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్లలో కీలక శస్త్ర చికిత్స పరికరాలను ప్రారంభించిన హరీశ్‌రావు అక్కడి అధికారులతో మాట్లాడారు.
టీ డయాగ్నోస్టిక్స్, బస్తీ దవాఖానాలకు అనుబంధంగా హైదరాబాద్‌లో రేడియోలజీ ల్యాబ్స్ ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ నెల 11వ తేదీన హైదరాబాద్‌లో 10 రేడియోలజీ ల్యాబ్స్ ప్రారంభించబోతున్నామని మంత్రి చెప్పారు. రేడియోలజీ ల్యాబ్‌ల్లో అల్ట్రా సౌండ్ పరీక్షలు, 2డీ ఎకో, ఎక్స్ రే, మెమోగ్రఫీ లాంటి పరీక్షలను బస్తీవాసులకు ఉచితంగా నిర్వహిస్తామన్నారు. మొత్తం 12 పెట్టాలని నిర్ణయించాం.. కానీ 10 పూర్తయ్యాయి. మరో 2 ల్యాబ్‌లను పదిహేను రోజుల్లో అందుబాటులోకి తెస్తామన్నారు.
అలాగే.. హైదరాబాద్‌లోని 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో మూడు పూటలా నాణ్యమైన ఉచిత భోజనం పెట్టేందుకు చర్యలు చేపట్టామని హరీశ్‌రావు తెలిపారు. ఈ నెల 12వ తేదీన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల నుంచి ఆసుపత్రులకు వస్తున్న రోగులను, వారి సహాయకులను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నట్లు తెలిపారు.
ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రిలో మంత్రి మాట్లాడుతూ.. పేద రోగులలో ఊపిరితిత్తుల నాడ్యూల్స్, ఊపిరితిత్తులలోని అసాధారణ కణజాలం, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను గుర్తించడంలో సిటి స్కాన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని అన్నారు. ఎర్రగడ్డలోని చెస్ట్ ఆస్పత్రిలో సీటీ స్కాన్ ప్రారంభోత్సవంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్‌ఖాన్‌తోపాటు సీనియర్ ఆరోగ్య అధికారులు పాల్గొన్నారు.