హైదరాబాద్ నగరంలో మరోసారి గంజాయి చాకొలేట్ల కలకలం చెలరేగింది. జగద్గిరిగుట్ట బస్తీలో గంజాయి కలిపిన చాక్లెట్ల అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్న ఓ కిరాణా షాపు యజమానిని ఎస్‌ఓటీ బాలానగర్ బృందం, జగద్గిరిగుట్ట పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు.
61 ప్రత్యేక ప్యాకెట్లలో ప్యాక్ చేసిన సుమారు 13 కిలోల బరువున్న 2,400 గంజాయి చాక్లెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సునీల్ కుమార్ ఝా అనే వ్యక్తి ఎంచక్కా తన కిరాణా దుకాణంలో గంజాయి చాకోలెట్లను అమ్మడం మొదలుపెట్టారు. అతను 20 సంవత్సరాల క్రితం బీహార్ నుండి వలస వచ్చి ఆ ప్రాంతంలో కిరాణా దుకాణాన్ని ప్రారంభించాడు. ఈ గంజాయి చాక్లెట్లను బీహార్ నుంచి తీసుకొచ్చి వలస కార్మికులకు ఒక్కో చాక్లెట్‌కు 40 రూపాయలకు అమ్ముతున్నాడు. పట్టుబడిన డ్రగ్స్ మొత్తం విలువ రూ. 97,600 అని అధికారులు తెలిపారు.