గోషామహల్ పోలీస్టేషన్ పరిధిలో పోలీసులు భారీ నగదు స్వాధీనం చేసుకున్నారు. గోషామహల్ గ్యాన్ బాగ్ కాలనీలోని గోకుల్ గోల్డ్ ఎలక్ట్రిక్ ఐటమ్స్ షాప్ సమీపంలో ముగ్గురు వ్యక్తులు రెండు ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా డబ్బుతో పట్టుబడ్డారు. తనిఖీలలో మూడు సంచులలో భారీ మొత్తంలో నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు విలువ 76,87,650/- (రూపాయలు డెబ్బై ఆరు లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల రూపాయలు)గా పోలీసులు వెల్లడించారు. అనుమానితులను జ్యోతిరామ్, గణపతి రామ్, మహేందర్‌లుగా పోలీసులు గుర్తించారు. ముగ్గురు అనుమానితులను పోలీస్ స్టేషన్‌కు తరలించి నగదుపై ఆరాతీశారు. అనుమానితులు పొంతనలేని సమాధానం చెప్పటంతో పాటు నగదుకు సంబంధించి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలను సమర్పించకపోవడంతో పోలీసులు నగదును సీజ్ చేశారు. ఈ ఘటనపై గోషామహల్ ఇన్‌స్పెక్టర్ స్పందిస్తూ.. స్వాధీనం చేసుకున్న నగదును ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించనున్నట్లు తెలిపారు.