పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన రాజా సింగ్.. ఎందుకంటే?
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హైదరాబాద్ పోలీసులకు కృతజ్ఞతలు
By Medi Samrat Published on 20 Jan 2024 6:00 PM ISTగోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హైదరాబాద్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. రాజా సింగ్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఇటీవల పోలీసు ఉన్నతాధికారులకు, సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదులు చేశారు. హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి మరీ నిందితున్ని గుర్తించారు. దీంతో రాజాసింగ్ హైదరాబాద్ పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు. గత కొంతకాలం నుంచి రాజాసింగ్‌కు విదేశీ నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయి. రాజా సింగ్ కు ఫోన్ చేసింది కువైట్‌లో మకాం వేసిన మహమ్మద్ ఖాసిం అనే వ్యక్తిగా గుర్తించారు. రాజాసింగ్‌కు ఖాసిం ఫోన్ కాల్స్ చేస్తున్నట్లుగా సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ధారించారు. హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ ఖాసిం 14 ఏళ్లుగా కువైట్‌లో ఉంటున్నాడు. చాంద్రాయణగుట్ట నుంచి దుబాయ్‌కి వెళ్లి అక్కడి నుంచి కువైట్‌లో ఖాసిం సెటిల్ అయ్యాడు.
హైదరాబాద్ పోలీసులు తన ఫిర్యాదుపై స్పందించి తనకు కాల్స్ చేస్తున్న వ్యక్తిని గుర్తించటం ఆనందంగా ఉందని రాజాసింగ్ తెలిపారు. తాను కార్పొరేటర్‌గా ఉన్నప్పటి నుంచి తనకు ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు. తనను చంపేస్తామంటూ వచ్చిన ఎన్నో కాల్స్ గురించి పోలీసులకు వందల సంఖ్యలో ఫిర్యాదులు చేసినట్టు రాజాసింగ్ తెలిపారు. తాను ఇచ్చిన కంప్లైంట్స్ మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేయటం, తర్వాత తనకు తెలియకుండానే వాటిని క్లోజ్ చేయటం జరిగేదని అన్నారు. అయితే మొదటిసారి హైదరాబాద్ పోలీసులు తన కంప్లైంట్ మీద దృష్టి పెట్టి కాల్స్ చేసే వ్యక్తిని కనిపెట్టారన్నారు రాజాసింగ్. నిందితున్ని విలైనంత తొందరగా అరెస్ట్ చేయాలని పోలీసులను రాజా సింగ్ కోరారు.
Next Story