ఫిర్యాదుల పరిష్కారమే లక్ష్యంగా.. నడుం బిగించిన జీహెచ్‌ఎంసీ..!

GHMC grievance redressal. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు.. జీహెచ్‌ఎంసీ పరిధిలో సమస్యల పరిష్కారానికి దిద్దుబాటు

By అంజి  Published on  14 Oct 2021 5:01 AM GMT
ఫిర్యాదుల పరిష్కారమే లక్ష్యంగా.. నడుం బిగించిన జీహెచ్‌ఎంసీ..!

మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు.. జీహెచ్‌ఎంసీ పరిధిలో సమస్యల పరిష్కారానికి దిద్దుబాటు చర్యలు చేపట్టింది అధికార యంత్రాంగం. పోలీసులు, ఫైర్ సిబ్బంది సేవల మాదిరిగా చెత్తకుప్పలు, వ్యర్థాల తరలింపు, నాలాలు, గుంతలు, చెట్లు కొట్టడం, పార్కులు, పచ్చదనం కోసం, పన్నులు, అక్రమ నిర్మాణాల సమస్యల పరిష్కారానికి బల్దియా సిబ్బంది పని చేయాలని ఇటీవల మంత్రి కేటీఆర్ ఆదేశించారు. అలాగే ఫిర్యాదుల స్వీకరణ, సమస్య పరిష్కార వ్యవస్థలు పని చేయాలన్నారు. ఈ మేరకు ఫిర్యాదుల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ సెల్ బలోపేతం చేసేందుకు జీహెచ్‌ఎంసీ కమిషన్‌ లోకేశ్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు జీహెచ్‌ఎంసీ హెడ్‌ ఆఫీస్‌లో అడిషనల్‌ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగర ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడంలో అడిషనల్ కమిషనర్లు కీలకంగా వ్యవహరించాలని లోకేష్ కుమార్ అన్నారు.

అన్ని శాఖల ముఖ్య అధికారులు రాత్రి సమయాల్లో కూడా విధలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రతి రోజు మూడు షిప్టుల్లో విధులు నిర్వహించేలా కార్యచరణ రూపొందించి.. ఈ విధానాన్ని త్వరలోనే అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ యాప్, ట్విట్టర్‌ ద్వారా ప్రజలు తమ ఫిర్యాదులను జోనల్‌ అధికారులకు తెలుపుతుండా.. అధికారులు వాటికి పరిష్కారం చూపుతున్నారు. అయితే వివిధ శాఖల మధ్య సమన్వయ లోపంతో ఫిర్యాదుల పరిష్కారం ఆలస్యమవుతోంది. దీంతో సమస్యల పరిష్కారానికి బల్దియా నడుం బిగించింది. శానిటేషన్, ఈవీడీఎం, టౌన్‌ ప్లానింగ్‌, ప్రాజెక్టు, ఇంజినీరింగ్‌తో పాటు పలు శాఖలకు సంబంధించి అధికారులు మూడు షిప్టుల్లో పని చేయనున్నారు. ప్రస్తుతం ఫిర్యాదులను మైజీహెచ్‌ఎంసీ మొబైల్ యాప్‌, డయల్‌ 100, కాల్‌ సెంటర్ నంబర్ 040 - 2111 1111, రాతపూర్వకంగా ఇన్‌వార్డులో ఇవ్వడం ద్వారా స్వీకరిస్తారు.

Next Story