బ్రేకింగ్ : జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
GHMC Election Notification Announced. జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ మంగళవారం నాడు విడుదలైంది.
By Medi Samrat
జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ మంగళవారం నాడు విడుదలైంది. ఎన్నికల కమిషనర్ పార్థసారధి కొద్దిసేపటి క్రితం షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవంబర్ 18( బుధవారం) నుంచే జీహెచ్ఎంసీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన అన్నారు.
డిసెంబర్ 1న గ్రేటర్ ఎన్నికల పోలింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. 4 తేదీన ఓట్ల లెక్కింపు వుంటుందని.. అదే రోజు ఫలితాలు కూడా వెల్లడించడం జరుగుతుందందని ఆయన అన్నారు. ఇక నామినేషన్లకు చివరిరోజు నవంబర్ 20. 21వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుందని.. నామినేషన్ల ఉపసంహరణకు 22 చివరి తేదీ అని పార్థసారథి ప్రకటించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ చట్ట ప్రకారమే జరుగుతుందని.. ఈ ఎన్నికలకు దేశవ్యాప్తంగా ప్రాధాన్యత ఉందని ఎన్నికల కమిషనర్ పార్ధసారథి వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి కసరత్తు పూర్తి చేశామని.. గత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని పార్ధసారథి వెల్లడించారు.
ఇదిలావుంటే.. జనవరి 1, 2020 నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్నవారు ఓటు వేసేందుకు అర్హులని తెలిపారు. బల్దియా పరిధిలో 52.09 శాతం పురుష, 47.90 శాతం మహిళా ఓటర్లున్నారని తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 74 లక్షల 4 వేల మందికి పైగా ఓటర్లున్నారని వెల్లడించారు. అత్యధికంగా మైలార్‌దేవ్‌పల్లిలో 79,290 మంది ఓటర్లు ఉండగా.. అత్యల్పంగా రామచంద్రాపురంలో 27,997 మంది ఓటర్లున్నారని ఎస్‌ఈసీ వివరించారు.