చేప ప్రసాదం కోసం వచ్చే వాళ్లకు.. ఇవి కూడా ఇస్తారు

బత్తిని సోదరులు ఇచ్చే చేప ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాల నుండే కాదు.. దేశంలోని ఎన్నో ప్రాంతాల నుండి వస్తూ ఉంటారనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

By Medi Samrat  Published on  21 May 2024 7:55 AM GMT
చేప ప్రసాదం కోసం వచ్చే వాళ్లకు.. ఇవి కూడా ఇస్తారు

బత్తిని సోదరులు ఇచ్చే చేప ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాల నుండే కాదు.. దేశంలోని ఎన్నో ప్రాంతాల నుండి వస్తూ ఉంటారనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాశ సంబంధ వ్యాధుల నివారణకు బత్తిన కుటుంబం ఉచితంగా చేప మందును అందిస్తూ ఉంటుంది. ఈ ఏడాది కూడా హైదరాబాద్​లోని నాంపల్లి ఎగ్జిబిషన్​ గ్రౌండ్​లో జూన్ ​8న ఉచిత చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు బత్తిని మృగశిర ట్రస్టు నిర్వాహకులు, దివంగత బత్తిని హరినాథ్​ కొడుకు అమర్నాథ్​ గౌడ్ తెలిపారు. జూన్ 8న శనివారం ఉదయం 11 గంటలకు మృగశిర కార్తె ప్రవేశిస్తుందని.. అదే రోజు చేప ప్రసాదం పంపిణీని ప్రారంభిస్తామన్నారు. జూన్ 9 ఆదివారం ఉదయం 11 గంటల వరకు 24 గంటలపాటు పంపిణీ చేస్తామని చెప్పారు. 3 లక్షల చేప పిల్లలకు ఆర్డర్​ ఇచ్చామని.. వెజిటేరియన్లకు బెల్లంతో ప్రసాదం ఇస్తామని చెప్పారు.

చేప ప్రసాదం పంపిణీకి గత ప్రభుత్వాలు పూర్తిగా సహకరించాయని అమర్నాథ్​ గౌడ్ తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్​రెడ్డితో పాటు, మంత్రివర్గ సభ్యులను కలిసి చేప ప్రసాదం పంపిణీకి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని కోరుతామని తెలిపారు. చేప ప్రసాదం కోసం వచ్చేవారికి భోజనం, టీ, కాఫీ, మజ్టిగ, మంచినీళ్లను స్వచ్ఛంద సంస్థలు సమకూరుస్తాయని తెలిపారు. ఒక్క రూపాయి కూడా ఎవరికీ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. నాంపల్లిలో ప్రసాదం పంపిణీ పూర్తయిన అనంతరం దూద్​ బౌలిలో మూడు రోజులపాటు పంపిణీ ఉంటుందన్నారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం వీల్​చైర్స్​తోపాటు అంబులెన్స్​ సౌకర్యం ఏర్పాటు చేశామని మీడియాకు తెలిపారు.

Next Story