హైదరాబాద్: నేనేప్పుడూ వారసత్వాన్ని ప్రోత్సహించలేదు.. తాను దేశానికి ఉపరాష్ట్రపతిగా రాణించినా తన కుటుంబం నుంచి రాజకీయంగా ఎవరు ముందుకు రాకపోవడానికి గల కారణాలను వెంకయ్య నాయుడు బయటపెట్టారు. ముచ్చింతల్‌లో స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సందర్భంగా వెంకయ్యనాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాల్లో వారసత్వ భావనను తాను ఎప్పుడూ ప్రోత్సహించలేదని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. అదే కారణంతో తన కుమారుడు, కుమార్తెను రాజకీయ రంగంలోకి తీసుకురాలేదని తెలిపారు. పిల్లలకు మనం ఇచ్చే అసలైన సంపద ఆస్తులు కాదని, సంస్కృతి, విలువలు, సంప్రదాయాలే నిజమైన వారసత్వమని ఆయన అభిప్రాయపడ్డారు. తన జీవితకాలంలో సంపాదించిన అనుభవం, సేవాభావానికి ప్రతీకగా స్వర్ణభారత్ ట్రస్ట్‌ను మాత్రమే వారసత్వంగా పిల్లలకు అప్పగిస్తున్నానని చెప్పారు. ఈ ట్రస్ట్ సేవలను భవిష్యత్తులో కొనసాగించాలని తన కుమార్తెకు సూచించినట్లు తెలిపారు.
అమరావతిపై వివాదాలు సృష్టించొద్దు
రాజధాని అమరావతిపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం, రాష్ట్రంతోపాటు అందరం కలిసి రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసుకున్నామన్నారు. అమరావతి అంటే గన్నవరం, విజయవాడ, గుంటూరు, తాడికొండలు మాత్రమే కాదని, ఆంధ్రుల ఆకాంక్షకు ప్రతిరూపమన్నారు. రాజధాని నిర్మాణ విషయంలో సీఎం చంద్రబాబు చర్యలకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తోందన్నారు. ఈ విషయంలో అనవసర వివాదాలను సృష్టించొద్దని కోరారు.