కొత్త క్రిమినల్ చట్టాల‌ కింద తెలంగాణలో తొలి కేసు న‌మోదు

కొత్త క్రిమినల్ చట్టాలు సోమవారం నుండి అమలులోకి వచ్చిన నేప‌థ్యంలో.. దేశంలోని ప‌లు రాష్ట్రాలలో కొత్త నిబంధనల ప్రకారం ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అవుతున్నాయి

By Medi Samrat  Published on  1 July 2024 7:13 PM IST
కొత్త క్రిమినల్ చట్టాల‌ కింద తెలంగాణలో తొలి కేసు న‌మోదు

కొత్త క్రిమినల్ చట్టాలు సోమవారం నుండి అమలులోకి వచ్చిన నేప‌థ్యంలో.. దేశంలోని ప‌లు రాష్ట్రాలలో కొత్త నిబంధనల ప్రకారం ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అవుతున్నాయి. కొత్త క్రిమినల్ కోడ్ భారతీయ న్యాయ సంహిత (BNS) కింద తెలంగాణ పోలీసులు కూడా మొదటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చార్మినార్ పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు వ్యక్తులపై 281 బీఎన్‌ఎస్, 80(ఏ), 177 ఎంవీ యాక్ట్ కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

నంబర్ ప్లేట్లు లేకుండా డ్రైవింగ్ చేసినందుకు ఇద్దరు ద్విచ‌క్ర వాహ‌న‌దారుల‌పై చార్మినార్ పోలీస్ స్టేషన్‌లో బీఎన్‌ఎస్ కింద మొదటి క్రిమినల్ కేసు నమోదైంది. తనిఖీల్లో నెంబర్‌ ప్లేట్లు లేని రెండు బైక్‌లను పోలీసులు గుర్తించారు. 281 బీఎన్‌ఎస్, మోటార్ వెహికల్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. రైడర్‌లలో ఒకరు గిగ్ వర్కర్ కాగా, మరొకరు హోటల్‌లో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరూ ప‌నులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా పోలీసులు పట్టుకున్నారు.

బ్రిటిష్ కాలం నుంచి దేశంలో అమల్లో ఉన్న మూడు క్రిమినల్ చట్టాలు నేటి నుంచి మారాయి. డిసెంబర్ 2023లో పార్లమెంట్ ఆమోదించిన మూడు చట్టాలు నేటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వ‌చ్చాయి. బ్రిటిష్‌ కాలం నాటి ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ) ఇక మీదట భారతీయ న్యాయ సంహితగా (బీఎన్‌ఎస్‌), కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌ (సీఆర్‌పీసీ) భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత (బీఎన్‌ఎస్ఎస్)గా, ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ భారతీయ సాక్ష్య అధినియమ్‌ (బీఎస్ఎస్)గా మారనున్నాయి.

Next Story