మలక్‌పేట్ మెట్రో స్టేషన్ కింద అగ్నిప్రమాదం సంభవించింది. మెట్రో స్టేషన్ కింద పార్క్ చేసి ఉన్న ఒక బైక్ లో నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు క్షణాల్లోనే పెద్దవై అక్కడే పార్క్ చేసి ఉన్న ఐదు బైకులకు అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా ఐదు బైకులు మంటల్లో తగలబడుతూ ఉండడంతో ఆ ప్రాంతమంతా పొగలు చుట్టుముట్టాయి. దట్టమైన పొగల కారణంగా స్థానికులు, వాహనదారులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఐదు బైకులు ఒకటేసారి తగలబడడం.. మంటలు పెద్ద ఎత్తున చెలరేగుతూ ఉండడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అందరూ చూస్తుండగానే ఐదు బైకులు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి.
ఈ ప్రమాదం కారణంగా మలక్‌పేట్ నుంచి దిల్‌సుఖ్‌నగర్ వరకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ప్రమాదంతో అక్కడ కొంత ఉదృత పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్ క్లియర్ చేశారు. పోలీసులు అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలుసు కొనేందుకు ప్రయత్నం చేస్తున్నారు.