ఎస్ఆర్‌హెచ్ ఆట‌గాళ్లు బస చేసిన హోటల్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బస చేసిన హోటల్‌లో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది.

By Medi Samrat
Published on : 14 April 2025 5:01 PM IST

ఎస్ఆర్‌హెచ్ ఆట‌గాళ్లు బస చేసిన హోటల్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బస చేసిన హోటల్‌లో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం ప్రకారం.. హోటల్ మూడో అంతస్తులో నిర్మించిన స్పాలో మంటలు చెలరేగాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో బస చేస్తుంది. విశేషం ఏమిటంటే.. మంటలు చెలరేగిన సమయానికి బృందం హోటల్ ప్రాంగణం నుండి వెళ్లిపోయింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హోటల్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఎటువంటి గాయాలు లేదా ప్రాణనష్టం సంభవించలేదు. అతి త్వరలో పరిస్థితి అదుపులోకి రావడంతో పెద్దగా నష్టం వాటిల్లలేదు. ఈ అగ్నిప్రమాదంలో అతిథులు లేదా హోటల్ సిబ్బందికి ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు ధృవీకరించారు. మంటలు ఎలా చెలరేగాయి అనే కోణంలో ఇంకా దర్యాప్తు జరుగుతోంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తదుపరి మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్‌తో గురువారం వాంఖడే స్టేడియంలో ఆడాల్సి ఉంది. టీమ్ అంతా తెల్లవారుజామున విమానాశ్రయానికి బయలుదేరారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు వచ్చే వారం అంటే ఏప్రిల్ 23న ముంబై ఇండియన్స్‌తో తమ సొంత మైదానంలో ఆడనుంది.

పాట్ కమిన్స్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ నాలుగు వరుస మ్యాచ్‌లలో ఓడిపోయిన తర్వాత విజయాన్ని రుచి చూసింది. ఆరెంజ్ ఆర్మీ పంజాబ్ కింగ్స్‌ను హై స్కోరింగ్ మ్యాచ్‌లో 9 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో ఓడించింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. అనంతరం 18.3 ఓవర్లలో SRH 2 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. ఐపీఎల్ 2025లో హైదరాబాద్ జట్టు 6 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది.

Next Story