హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పార్కింగ్ వద్ద శనివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలు కార్లు దగ్థమయ్యాయి.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రస్తుతం నుమాయిష్ జరుగుతోంది. వీకెండ్ కావటంతో విపరీతమైన రద్దీ ఉంది. చాలా మంది కుటుంబాలతో కలిసి ప్రదర్శన తిలకించేందుకు తరలివచ్చారు. అందరూ ఎంతో ఉత్సాహంగా ఉండగా.. ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎదురుగా ఉన్న గగన్ విహార్ లోని పార్కింగ్ ప్రదేశంలో ఉన్న ఓ ఎలక్ట్రిక్ కారు నుంచి తొలుత మంటలు చెలరేగాయి. పార్కింగ్ ప్రదేశంలో పక్క పక్కనే కార్లు నిలిపి ఉంచడంతో మంటలు వేగంగా పక్కనున్న కార్లకు వ్యాపించాయి.
క్షణాల్లోనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే.. అప్పటికే నాలుగు కార్లు పూర్తిగా దగ్థం కాగా.. మరో రెండు కార్లు పాక్షికంగా కాలిపోయాయి. మిగతా కార్లకు మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
శనివారం కావడంతో నుమాయిష్‌కు భారీ సంఖ్యలో సందర్శకులు వచ్చారు. మంటలు ఎగిసిపడడంతో ఏం జరిగిందో అర్థం కాక కాసేపు అక్కడ కలకలం రేగింది. ఏం జరిగిందో చూసేందుకు జనం గుమిగూడడంతో నాంపల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మంటలను అదుపు చేసిన అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
కాగా.. ఈ ప్రమాదంలో ఎవ్వరికి ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. శనివారం రాత్రి 9.30 గంటల వరకు నుమాయిష్‌ను 75 వేల మంది సందర్శించారు.