హైదరాబాద్‌లోని పంజాగుట్టలో శుక్రవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్ కింది భాగంలో పిల్లర్లకు ఏర్పాటు చేసిన డెకరేషన్ సామగ్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. జోయా లుకాస్ జ్యుయెలరీ షాప్‌కు ఎదురుగా ఉన్న పిల్లర్ వద్ద ఈ ఘటన జరిగింది. ఒక్కసారి మంటలు రాడంతో ఆ మార్గంలో వెలుతున్న వాహనదారులు, పాదాచారులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశారు. మంటల నుంచి వెలువడుతున్న దట్టమైన పొగ ఆకాశాన్ని కమ్మేసింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు.
ప్రధాన రహదారిపై ఈ ఘటన జరగడంతో అప్రమత్తమైన పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చిన తరువాత ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్లైఓవర్ పిల్లరకు ఏర్పాటు చేసిన డెకరేషన్ వస్తువులకు నిప్పు అంటుకోవడం వల్లే మంటలు వ్యాపించినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఎలాంటి నష్టం జరగలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.