పీకలదాక తాగి కారు నడిపి ప్రాణం తీసిన సాప్ట్‌వేర్ ఇంజినీర్
హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో ఆదివారం రాత్రి 30 ఏళ్ల యువకుడు ఫోక్స్‌వ్యాగన్ పోలో కారుతో విధ్వంసం సృష్టించాడు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 April 2024 1:15 PM ISTహైదరాబాద్: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో ఆదివారం రాత్రి 30 ఏళ్ల యువకుడు ఫోక్స్‌వ్యాగన్ పోలో కారుతో విధ్వంసం సృష్టించాడు. మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేసిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా, మరో 11 మంది గాయపడ్డారు. క్రాంతి కుమార్‌గా గుర్తించిన నిందితుడు ఆదివారం అర్థరాత్రి పలు వాహనాలను ఢీకొట్టాడు. జూబ్లీహిల్స్‌లోని క్లబ్ లో ఫుల్ గా తాగిన తర్వాత క్రాంతి కుమార్ నిజాంపేటలోని తన ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. అతని బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ (BAC) బ్రీత్‌నలైజర్ పరీక్షలో 530 గా నమోదైంది. తదుపరి విచారణ కోసం క్రాంతి కుమార్ ను అదుపులోకి తీసుకున్నామని.. కేసు నమోదు చేసినట్లు రాయదుర్గం పోలీసులు ధృవీకరించారు.
క్రాంతి కుమార్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా IKEA రోటరీ దగ్గర.. అతని వాహనం ఓ SUVని ఢీకొట్టింది, ఫలితంగా మహిళా డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. క్రాంతి కుమార్ వాహనం అతివేగంతో వెళుతూ.. బయో డైవర్సిటీ జంక్షన్ ముందు మోటార్ సైకిల్‌ను ఢీకొట్టడంతో పలువురికి గాయాలయ్యాయి. ఆపకుండా అక్కడి నుండి అతను మెహదీపట్నం వైపు వెళ్ళాడు. షేక్‌పేట్ ఫ్లైఓవర్ సమీపంలో క్రాంతి కుమార్ వాహనం ఢీకొని ఓ పాదచారి దుర్మరణం చెందాడు. 20 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న ఆ వ్యక్తి ఆస్పత్రికి చేరుకునేలోపే మృతి చెందాడు. క్రాంతి కుమార్ వాహనం మరో బైక్‌ను ఢీకొనడంతో దానిపై ఉన్న ఇద్దరు యువకులు గాయపడ్డారు. మళ్లీ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ, అతను కిమ్స్ హాస్పిటల్ సమీపంలో ఒక ఆటోను ఢీకొట్టాడు, ముగ్గురికి గాయాలు అయ్యాయి. చివరికి కారు ముందు చక్రాలు పంచర్ అవ్వడంతో క్రాంతి కుమార్ వాహనాన్ని ఆపేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.