అమ్మాయిలూ సోషల్ మీడియా మాయలో పడకండి..సీపీ సజ్జనార్ హెచ్చరిక
స్మార్ట్‌ఫోన్ నేడు ఎంతోమంది యువతుల పాలిట శాపంగా మారుతోందని, పరిచయాలు ఊహించని ప్రమాదాలకు దారితీస్తున్నాయని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు.
By - Knakam Karthik |
అమ్మాయిలూ సోషల్ మీడియా మాయలో పడకండి..సీపీ సజ్జనార్ హెచ్చరిక
హైదరాబాద్: అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్‌ఫోన్ నేడు ఎంతోమంది యువతుల పాలిట శాపంగా మారుతోందని, సోషల్ మీడియాలో అపరిచితులతో ఏర్పడే పరిచయాలు ఊహించని ప్రమాదాలకు దారితీస్తున్నాయని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో ఇలాంటి విషాదకర ఘటనలు పెరగడంపై స్పందించిన ఆయన, సైబర్ నేరగాళ్లు అందమైన యువకులు లేదా సినీ నటుల ఫోటోలను ప్రొఫైల్ పిక్చర్లుగా పెట్టుకుని నకిలీ ఖాతాలతో అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపుతున్నారని హెచ్చరించారు. ఆ మాయమాటలకు ఆకర్షితులై తమ వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను పంచుకుంటున్న కొందరు యువతులు, ఆపై అదే అపరిచితుల చేతిలో బ్లాక్‌మెయిలింగ్‌కు గురవుతున్నారని ఆయన వివరించారు. ఈ ఫోటోలను మార్ఫింగ్ చేసి డబ్బులు అడగడం లేదా భౌతికంగా కలవాలని వేధించడం వంటి చర్యలతో అమ్మాయిలను తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నారని, పరువు పోతుందన్న భయంతో కొందరు ప్రాణాలు సైతం తీసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆన్‌లైన్‌లో ఇలాంటి సమస్యలు ఎదురైతే అస్సలు భయపడవద్దని, నేరగాళ్ల బ్లాక్‌మెయిలింగ్‌కు లొంగిపోకుండా వెంటనే తల్లిదండ్రులకు లేదా స్నేహితులకు సమాచారం ఇవ్వాలని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ఏమాత్రం సంకోచించకుండా డయల్ 100కు కాల్ చేసి పోలీసుల సహాయం కోరాలని, బాధితులకు అండగా పోలీసులు ఎల్లప్పుడూ ఉంటారని ఆయన భరోసా ఇచ్చారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలతో సమయం గడుపుతూ, వారు ఆన్‌లైన్‌లో ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉండాలని సూచించారు. ఫేక్ ప్రొఫైల్స్ లేదా వీపీఎన్‌లు వాడితే దొరకమని నేరగాళ్లు భ్రమపడొద్దని, ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సోషల్ మీడియా వాడకంలో అప్రమత్తంగా ఉంటూ, అన్యాయం జరిగినప్పుడు ధైర్యంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్‌ఫోన్.. ఇప్పుడు ఎంతోమంది ఆడపిల్లల పాలిట శాపంగా మారుతోంది. సోషల్ మీడియా వినియోగం పెరిగాక అపరిచితులతో ఏర్పడుతున్న పరిచయాలు యువతులను ఊహించని ప్రమాదాల్లోకి నెట్టేస్తున్నాయి. ఇటీవల కాలంలో ఈ తరహా విషాదకర ఘటనలు నా దృష్టికి ఎక్కువగా వస్తున్నాయి. ఆ కథనాలు… pic.twitter.com/sWbS2L4bhP
— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) March 21, 2026