హైదరాబాద్ నగరంలో జరిగే మతపరమైన ఊరేగింపులలో బాణాసంచా పేల్చడంతో పాటు డీజే సౌండ్ సిస్టమ్స్, సౌండ్ మిక్సర్లు, యాంప్లిఫయర్లు, ఇతర హై సౌండ్ జనరేటింగ్ పరికరాలు, ఉపకరణాలను ఉపయోగించడం నిషేధించామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. మతపరమైన ఊరేగింపుల సమయంలో ధ్వని కాలుష్యాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
మతపరమైన ర్యాలీలలో ఎలాంటి డీజేలను ఉపయోగించకూడదని తేల్చి చెప్పారు. సౌండ్ సిస్టంలను మాత్రం పరిమిత స్థాయిలో అనుమతిస్తామన్నారు. అయితే సౌండ్ సిస్టం పెట్టడానికి పోలీసుల అనుమతి తప్పనిసరి అని తేల్చి చెప్పారు. నాలుగు జోన్లలో సౌండ్ సిస్టంలో పెట్టడానికి డెసిబిల్స్ ను నిర్దేశించారు పోలీసులు. మతపరమైన ర్యాలీలలో బాణాసంచా కాల్చడం పూర్తిగా నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదు సంవత్సరాల జైలు శిక్షతోపాటు లక్ష రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.