Dharmendra : హైదరాబాద్‌లో ధర్మేంద్రకు ఎంతో ప్రత్యేకమైన ప్లేస్ ఉంది తెలుసా.?
బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర సోమవారం ఉదయం కన్నుమూశారు.
By - Medi Samrat |
బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర సోమవారం ఉదయం కన్నుమూశారు. అయితే.. హైదరాబాద్‌కు తన హృదయంలో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉందని చెప్పేవారు. ఆయన ఎప్పుడూ హైదరాబాద్‌తో తన జ్ఞాపకాల గురించి ఎంతో ఆప్యాయతతో మాట్లాడేవారు.
2017లో ఒక సినిమా ప్రమోషనల్ ఈవెంట్ సందర్భంగా.. ధర్మేంద్ర తాను జూబ్లీహిల్స్‌లో జాగింగ్‌కు ఎలా వెళ్లేవారో గుర్తుచేసుకున్నారు. అక్కడ జాగింగ్ చేయడం తనకు ప్రశాంతత, శాంతిని నింపిన రిఫ్రెష్ ఫీలింగ్ కలిగించేదని అభివర్ణించారు.
"హైదరాబాద్ గురించి నా హృదయంలో ఉన్న ప్రేమతో మాట్లాడటం నాకు చాలా ఇష్టం. హైదరాబాద్ ఒక అందమైన నగరం.. హృదయాన్ని వేడెక్కించే ప్రదేశం. 'మిర్చి కా సలాన్' నుండి 'బగరా బైంగన్' వరకు ఆహారం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ వడ్డించేవన్నీ రుచికరంగా ఉంటాయి," అని ఆయన చెప్పారు.
హైదరాబాద్ ప్రజలకు తనపై, తన సినిమాల పట్ల ఎంత ప్రేమ ఉందో చెప్పుకొచ్చారు. "నా సినిమాల్లో ఒకటైన 'ఫూల్ ఔర్ పత్తర్' విడుదలైనప్పుడే కాకుండా, ఇప్పుడు కూడా నగరంలోని మా ముస్లిం, హిందూ సోదరులు నన్ను 'షాకా' (ధర్మేంద్ర పాత్ర పేరు) అని ప్రేమగా పిలుచుకుంటారు. వారు నన్ను ఎంతగానో ప్రేమిస్తారు. నేను ఈ నగరాన్ని, ఇక్కడి ప్రజలను కూడా చాలా ప్రేమిస్తున్నాను", అని ఆయన అన్నారు.
"నగరం ఇటీవల చాలా అభివృద్ధి చెందింది. నగరం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని.. అభివృద్ధి చెందగలదని నేను ఆశిస్తున్నాను అని అన్నారాయన. హైదరాబాద్‌తో ధర్మేంద్ర బంధం చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయన అభిమానులు అంటున్నారు.