ముషీరాబాద్ హరి నగర్ రీసాల గడ్డ వాటర్ ట్యాంక్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. వాటర్ ట్యాంక్ ను శుభ్రం చేయడానికి వచ్చిన వాటర్ వర్క్స్ సిబ్బంది మృతదేహాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే వాటర్ వర్క్స్ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ముషీరాబాద్ సీఐ జహంగీర్, వాటర్ వర్క్స్ ఇన్ స్పెక్టర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ట్యాంక్ పై ఉన్న చెప్పులు మృతునికి సంబంధించినవిగా పోలీసులు అనుమానిస్తున్నారు.
మృతునికి సంబంధించిన ఆనవాళ్లను బట్టి మృతుని వయసు 35 నుండి 40 సంవత్సరాలు ఉండవచ్చని అంచనాకు వచ్చారు పోలీసులు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించడంతో వాటర్ ట్యాంక్ ప్రాంతానికి చేరుకున్న వారు మృతదేహాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరికాసేపట్లో మృతదేహం బయటకు తీసే అవకాశం ఉంది. తాగునీటికై వాడే ట్యాంక్‌లో మృతదేహం ఉందన్న వార్త తెలియడంతో స్థానికులు ఘటనా స్థలానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. మృతదేహం కుళ్ళిన వాసన వస్తుండటంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు.