గుండెజబ్బులకు తప్పుదారి పట్టించే లేబుల్స్‌తో మందుల అమ్మకాలు.. స్వాధీనం చేసుకున్న డీసీఏ
తెలంగాణ రాష్ట్రంలోని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు, లేబుళ్ల మీద తప్పుడు ప్రకటనలతో విక్రయిస్తున్న మందులను బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 April 2024 3:45 PM GMTగుండెజబ్బులకు తప్పుదారి పట్టించే లేబుల్స్‌తో మందుల అమ్మకాలు.. స్వాధీనం చేసుకున్న డీసీఏ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు, లేబుళ్ల మీద తప్పుడు ప్రకటనలతో విక్రయిస్తున్న మందులను బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ మందులు ‘గుండె జబ్బులు’, ‘ఋతుస్రావం సరిగా జరగడానికి’ ఉపయోగించొచ్చనే హామీలతో విక్రయిస్తున్నారు. ఇటువంటి వాదనలతో మందులు అమ్మడం.. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ (అభ్యంతరకరమైన ప్రకటనలు) చట్టం, 1954కి విరుద్ధం.
తప్పుదారి పట్టించే లేబుల్స్ తో మందుల అమ్మకాలు:
ఏప్రిల్ 23-24 తేదీలలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన DCA అధికారులు.. తప్పుదోవ పట్టించే ప్రకటనలతో మార్కెట్లో అమ్ముతున్న రెండు రకాల మందులను కనుగొన్నారు. కార్డినాల్ జోషాండా అనే యునాని ఔషధం అమ్మకాలు జరుగుతున్నాయని, ఈ ఔషధం గుండెలో అడ్డంకులను తొలగిస్తుందని లేబుల్‌పై ప్రకటన ఉన్నట్లు గోషామహల్ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ గుర్తించారు. హైదరాబాద్‌లోని అబిడ్స్‌లోని ఎంజే మార్కెట్‌లోని ఓ మెడికల్ షాపులో డీసీఏ ఈ మందులను స్వాధీనం చేసుకుంది.
హైదరాబాద్‌లోని మధురానగర్‌లోని ఓ మెడికల్ షాపుపై యూసుఫ్‌గూడ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ సోదాలు నిర్వహించారు. కోలినాల్-స్పాస్ (మెఫెనామిక్ యాసిడ్, డైసైక్లోమైన్ హైడ్రోక్లోరైడ్ టాబ్లెట్స్ ఐపీ) అనే అల్లోపతి మాత్రలను తప్పుదారి పట్టించే లేబుల్‌లతో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఉత్తరాఖండ్‌లోని కాశీపూర్‌లోని వివిమెడ్ ల్యాబ్స్ లిమిటెడ్ ఈ మందును తయారు చేస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన అధికారులు తదుపరి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
దొంగ డాక్టర్ ను పట్టుకున్న అధికారులు:
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నకిలీ ఆర్‌ఎంపీ డాక్టర్ ను అధికారులు పట్టుకున్నారు. DCA అధికారులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహాముత్తారం మండలం, యామన్‌పల్లె గ్రామంలో ఒక క్లినిక్‌పై దాడి చేసి విక్రయించడానికి నిల్వ చేసిన మందులను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నరేందర్ నివాసంపై డీసీఏ అధికారులు దాడులు చేశారు. సరైన లైసెన్స్ లేకపోయినా నరేందర్ ‘రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్’గా మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ దాడిలో డీసీఏ అధికారులు డ్రగ్స్ లైసెన్స్ లేకుండానే ఆవరణలో భారీగా మందుల నిల్వలను గుర్తించారు. యాంటీబయాటిక్స్, అనాల్జెసిక్స్, యాంటీ అల్సర్ డ్రగ్స్ మొదలైన 29 రకాల మందులు అక్కడ నిల్వ చేసినట్లు గుర్తించారు. ఈ దాడిలో మొత్తం రూ.26,800 విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
DCA అధికారులు దాడి సమయంలో క్లినిక్‌లో అనేక 'యాంటీబయోటిక్ ఇంజెక్షన్‌లను' కూడా గుర్తించారు. విచక్షణారహితంగా యాంటీబయాటిక్స్ అమ్మకం, అర్హత లేని వ్యక్తులు యాంటీబయాటిక్స్ ను రోగులకు అంటగడుతూ ఉండడంతో గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది.
డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ అంటే ఏమిటి?
డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ (అభ్యంతరకరమైన ప్రకటనలు) చట్టం, 1954 ప్రకారం 'గుండె జబ్బులు', 'ఋతు ప్రవాహ రుగ్మతల' చికిత్స కోసం ఔషధాన్ని ప్రచారం చేయడం నిషేధించారు. ఈ చట్టం కొన్ని వ్యాధులు, రుగ్మతల చికిత్సకు సంబంధించి కొన్ని మందుల ప్రకటనలను నిషేధిస్తుంది. ఈ చట్టం కింద సూచించిన వ్యాధులు/రుగ్మతలకు సంబంధించిన ప్రకటనల ప్రచురణలో ఏ వ్యక్తి కూడా పాల్గొనకూడదు. తప్పుదారి పట్టించే ప్రకటనలు చేసే వ్యక్తులు డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ చట్టం ప్రకారం ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా జరిమానా.. ఒక్కోసారి రెండూ విధించవచ్చు.
పబ్లిక్ అడ్వైజరీ
డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం.. అర్హత లేని వ్యక్తులకు మందులను సరఫరా చేసే హోల్‌సేలర్లు/డీలర్లు, డ్రగ్స్ లైసెన్స్ లేకుండా డ్రగ్స్ నిల్వలు, విక్రయాలు చేస్తే కూడా శిక్షార్హులు. ఔషధాలను సరఫరా చేసే ముందు డ్రగ్ లైసెన్స్‌ని తప్పనిసరిగా కలిగి ఉండాలి. DCA తెలంగాణ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టంలోని నిబంధనల ప్రకారం మందుల నిల్వ మరియు అమ్మకం కోసం డ్రగ్స్ లైసెన్స్‌లను జారీ చేస్తుంది. డ్రగ్ లైసెన్స్ లేకుండా మందులను నిల్వ ఉంచితే ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించబడుతుంది.
డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, తెలంగాణ, టోల్-ఫ్రీ నంబర్ 1800-599-6969 ద్వారా ఔషధాలకు సంబంధించిన చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన ఫిర్యాదులను ప్రజలు నివేదించవచ్చు.