సమంత మాటలను నమ్మొద్దంటున్న డాక్టర్లు

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్లూ రిలీఫ్ కోసం హైడ్రోజన్ పెరాక్సైడ్ పీల్చమని టాలీవుడ్ నటి సమంతా సిఫార్సు చేయడాన్ని పలువురు తప్పుబడుతూ ఉన్నారు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 July 2024 2:01 PM GMT
సమంత మాటలను నమ్మొద్దంటున్న డాక్టర్లు

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్లూ రిలీఫ్ కోసం హైడ్రోజన్ పెరాక్సైడ్ పీల్చమని టాలీవుడ్ నటి సమంతా సిఫార్సు చేయడాన్ని పలువురు తప్పుబడుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో సమంత పెట్టిన పోస్ట్ పై 'లివర్‌డాక్' అనే అకౌంట్ నుండి డాక్టర్ అబ్బి ఫిలిప్స్ ఆమె చెబుతోంది తప్పు అంటూ వివరణ ఇచ్చారు. అలాంటి సూచనలు సోషల్ మీడియాలో కరెక్ట్ కాదని.. ఆరోగ్యానికి సంబంధించి ఇచ్చే సలహాలు ఇతరులను ప్రభావితం చేస్తాయని అన్నారు. అంతేకాకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

డాక్టర్ ఫిలిప్స్ స్పందిస్తూ.. సమంతా అటువంటి సలహాను సూచించినందుకు ‘health and science illiterate’ అని ముద్ర వేశారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ పీల్చడం వల్ల కలిగే ప్రమాదాల గురించి హైలైట్ చేశారు. అమెరికాకు చెందిన ఆస్తమా- అలెర్జీ ఫౌండేషన్ ఇచ్చిన హెచ్చరికలను కూడా ప్రస్తావించారు. శాస్త్రీయంగా ప్రగతిశీల సమాజంలో, ఇటువంటి చర్యలు ప్రజారోగ్యానికి హాని కలిగిస్తాయని.. ఇలాంటి వాటికి జరిమానాలు లేదా జైలు శిక్ష వంటివి విధించాలని డాక్టర్ ఫిలిప్స్ డిమాండ్ చేశారు.

ఆరోగ్యానికి హానికలిగించే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న సోషల్ మీడియా సెలెబ్రిటీలపైనా, ఇన్ఫ్లుయెన్సర్ల పైనా భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేదా ఏదైనా నియంత్రణ సంస్థ పచర్యలు తీసుకుంటుందా లేదా అని ఆయన ప్రశ్నించారు.

సమంత ప్రకటన:

ఈ విమర్శలపై సమంత స్పందించింది. “విమర్శలకు ప్రతిస్పందనగా, నేను నా చర్యలను వివరించాలనుకుంటున్నాను. గత రెండు సంవత్సరాలుగా, నేను వివిధ మందులు, చికిత్సలను ప్రయత్నించాను. వాటిలో చాలా ఖరీదైనవి కూడా ఉన్నాయి. చాలా వరకూ ఎల్లప్పుడూ ప్రభావవంతంగా లేవు. ఇది నా పోస్ట్‌లో నేను పేర్కొన్న దానితో సహా ప్రత్యామ్నాయ చికిత్సలను అన్వేషించడానికి నన్ను నడిపించింది. ఇది నాకు బాగా పనిచేసింది. నా ఉద్దేశ్యం ఏదైనా చికిత్సను గట్టిగా సమర్థించడం కాదు, నా అనుభవాన్ని పంచుకోవడం.” అని ప్రకటన పేర్కొంది.

"నా సిఫార్సు అత్యంత అర్హత కలిగిన డాక్టర్ నుండి వచ్చింది, ఆయన 25 సంవత్సరాలు DRDOలో పనిచేశారు. నా పోస్ట్‌ను, నా సలహాలను ఉద్దేశపూర్వకంగా దూషించారు. ఆయన కూడా డాక్టరే. నాకంటే ఆయనకు ఎన్నో విషయాలపై అవగాహన ఉంటుందనడంలో సందేహం లేదు. నన్ను నిందించడం కంటే నాకు చికిత్స చేసిన డాక్టర్‌తో ఆయన డైరెక్ట్ గా మాట్లాడి ఉంటే బాగుండేది. నా వైద్యునితో మర్యాదపూర్వక చర్చ మరింత నిర్మాణాత్మకంగా ఉండేది. నేను నా అనుభవాన్ని సెలబ్రిటీగా కాకుండా సమర్థవంతమైన వైద్య చికిత్సలను కోరుకునే వ్యక్తిగా పంచుకున్నాను" అని సమంత తన ప్రకటనలో వివరించింది.

హైదరాబాద్‌లోని వైద్య నిపుణుల అభిప్రాయాలు:

అనేక మంది హైదరాబాద్ వైద్యులు హైడ్రోజన్ పెరాక్సైడ్ పీల్చడం వల్ల కలిగే ప్రమాదాలను బయట పెట్టారు.

అపోలో హెల్త్‌కేర్‌లోని పల్మోనాలజిస్ట్ డాక్టర్ డిబి గణపతి మాట్లాడుతూ “ఫేస్‌బుక్, ట్విట్టర్, రీల్స్ వంటి సోషల్ మీడియా ఛానెల్‌లలో ఆందోళనకరమైన, ప్రమాదకరమైన ధోరణి కొనసాగుతూ ఉంది. ఫ్లూ లేదా ఆస్తమా కేసులను నివారించడానికి లేదా చికిత్స చేయడానికి ప్రజలు ఆవిరి ద్వారా హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను పీల్చుతున్నారు. వాస్తవానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ తీసుకోవడం, పీల్చడం ప్రమాదకరమైనది.. కొన్ని కొన్నిసార్లు విషపూరితమైనవి కూడా.. హౌస్ హోల్డ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ (3%) పీల్చడం శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుంది, ” అని తెలిపారు.

డాక్టర్ కె.శిరీష్ మాట్లాడుతూ, “హైడ్రోజన్ పెరాక్సైడ్ ఏదైనా అంటు వ్యాధికి నివారణ కాదు. హైడ్రోజన్ పెరాక్సైడ్ సాధారణ జలుబు, కోవిడ్-19, HIV, క్యాన్సర్ లేదా మరేదైనా వ్యాధిని నయం చేయగలదని ఎటువంటి ఆధారాలు లేవు. లోతైన గాయాలు, కాట్లు, తీవ్రమైన కాలిన గాయాలు లేదా ఫ్లూ, జలుబు కేసులకు చికిత్స చేయడానికి ఉపయోగించకూడదు." అని తెలిపారు.

హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటే ఏమిటి?

హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేక బ్లీచ్‌లు, రంగులు, క్లెన్సర్‌లు, యాంటిసెప్టిక్స్, క్రిమిసంహారక మందులలో కనిపిస్తుంది.

"హైడ్రోజన్ పెరాక్సైడ్ తో చర్మ సంరక్షణ, నోటి పరిశుభ్రత వంటి వివిధ ఉపయోగాలు ఉంటాయి. కొన్నిసార్లు చిన్న కోతలు, కాలిన గాయాలను నిరోధించడానికి మందుగా కూడా హైడ్రోజన్ పెరాక్సైడ్ ను ఉపయోగిస్తారు. ఇది ప్రభావిత ప్రాంతంపై ఉంది ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. మృత చర్మాన్ని తొలగించి, ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయడంతో నురుగు వస్తుంది. అధిక మోతాదులో ఉపయోగిస్తే ఊహించని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది" అని కిమ్స్ ఆసుపత్రిలో పల్మోనాలజిస్ట్ డాక్టర్ కెవి మధుసూధన్ అన్నారు.

దుష్ప్రభావాలు:

హైడ్రోజన్ పెరాక్సైడ్ దుష్ప్రభావాలను వైద్యులు వివరించారు:

1. శ్వాసకోశ సమస్యలు: హైడ్రోజన్ పెరాక్సైడ్ పీల్చడం వల్ల ముక్కు, గొంతు, ఛాతీలో మంటగా అనిపించవచ్చు. దీని వలన శ్వాసకోశ సమస్యలు, చికాకులు ఏర్పడుతాయి.

2. తీవ్రమైన అనారోగ్యం: అధిక సాంద్రతలు (10% లేదా అంతకంటే ఎక్కువ) బ్రోన్కైటిస్, పల్మనరీ ఎడెమాతో సహా తీవ్రమైన పల్మనరీ సమస్యలకు దారితీయవచ్చు.

3. గ్యాస్ట్రోఇంటెస్టినల్ డ్యామేజ్: అధిక సాంద్రతలను తీసుకోవడం వల్ల తీవ్రమైన గ్యాస్ట్రోఇంటెస్టినల్ బర్నింగ్, ఎరోషన్, వ్రణోత్పత్తి, చిల్లులు ఏర్పడడం, కొన్ని కొన్ని సార్లు మరణానికి కారణమవుతుందని డాక్టర్ సుభాకర్ వివరించారు.

Next Story