Video : 'చాలా బాధేస్తుంది.. మీకూ ఒకరోజు ఓల్డేజీ సమస్యలు వస్తాయి'
తెలంగాణ ప్రభుత్వం చారిత్రక తల్లిదండ్రుల మద్దతు బిల్లును కేబినెట్‌లో ఆమోదించడం ఒక విప్లవాత్మక మార్పు అని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు.
By - Medi Samrat |
తెలంగాణ ప్రభుత్వం చారిత్రక తల్లిదండ్రుల మద్దతు బిల్లును కేబినెట్‌లో ఆమోదించడం ఒక విప్లవాత్మక మార్పు అని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయం అని కొనియాడారు. ఈ క్రమంలోనే ఆయన ఎక్స్‌లో ఒక వీడియోతో కూడిన ఓ సందేశాన్ని విడుదల చేశారు.
ఆయన పోస్టులో.. 'చిన్నారులుగా ఉన్నప్పుడు అడుగు తడబడితే చేయి అందించి, తమ కడుపు కట్టుకుని ఆకలి తీర్చి, పిల్లల ఎదుగుదలే శ్వాసగా బతికే ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు. మానవీయ విలువలు మృగ్యమవుతున్న నేటి కాలంలో కన్నవారిని కళ్లల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యతను గుర్తుచేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం.
దురదృష్టవశాత్తు ఆప్యాయతను పంచాల్సిన చేతులే ఈరోజు కన్నవారిని రోడ్డు పాలు చేస్తున్న సంఘటనలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఈ సామాజిక వేదనను రూపుమాపేందుకు తెలంగాణ ప్రభుత్వం చారిత్రక తల్లిదండ్రుల మద్దతు బిల్లును కేబినెట్‌లో ఆమోదించడం ఒక విప్లవాత్మక మార్పు.
వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగుల జీతంలో కొంత భాగాన్ని నేరుగా తల్లిదండ్రులకు చెందేలా చట్టం తీసుకురావాలని నిర్ణయించడం గొప్ప పరిణామం. ఇది బాధ్యతను విస్మరిస్తున్న బిడ్డలకు వారి కర్తవ్యాన్ని గుర్తుచేసే ఒక హెచ్చరిక. అమ్మనాన్నల ఆత్మగౌరవాన్ని కాపాడే ఒక భరోసా.
ఈ బిల్లు మన దేశానికి స్పూర్తిదాయకం. యావత్ ప్రపంచానికి ఒక దిక్సూచి. కన్నవారే ప్రత్యక్ష దైవాలనే సత్యాన్ని విస్మరిస్తున్న నేటి తరానికి ఈ నిర్ణయం ఒక గొప్ప పాఠం.
వృద్ధాప్యంలో వారు కోరుకునేది విలాసాలు కాదు, కేవలం తమ బిడ్డల ప్రేమని, తోడుని మాత్రమే. ఆ తోడుని చట్టబద్ధం చేస్తూ, వారి కళ్లలో ఆనందాన్ని నింపేలా ఈ సాహసోపేతమైన, మానవీయ నిర్ణయం తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులను గౌరవిద్దాం.. వారి ఆశీస్సులే శ్రీరామరక్ష అని ముగించారు.
చిన్నారులుగా ఉన్నప్పుడు అడుగు తడబడితే చేయి అందించి, తమ కడుపు కట్టుకుని ఆకలి తీర్చి, పిల్లల ఎదుగుదలే శ్వాసగా బతికే ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు. మానవీయ విలువలు మృగ్యమవుతున్న నేటి కాలంలో కన్నవారిని కళ్లల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యతను గుర్తుచేస్తూ తెలంగాణ ప్రభుత్వం… pic.twitter.com/jV2LQNRSnx
— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) March 24, 2026