దేశం మొత్తం కరోనా వైరస్ భయం గుప్పిట్లో ఉన్న సంగతి తెలిసిందే..! తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తూ ఉంది. అధికారులు అప్రమత్తమై ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నా.. తెలంగాణలో కాస్త తక్కువగానే నమోదవుతూ ఉన్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోడానికి అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్న తరుణంలో హుస్సేన్ సాగర్ లో కరోనా వైరస్ జన్యు పదార్థాలు కనపడ్డాయనే వార్త కలవరాన్ని తెప్పిస్తోంది.
హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో కరోనా వైరస్ జన్యు పదార్థాలు కనపడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. సాగర్ తో పాటు ఇతర చెరువుల్లో కూడా ఈ పదార్థాలు కనిపించాయని అంటున్నారు. హుస్సేన్ సాగర్ తో పాటు నాచారం పెద్ద చెరువు, నిజాం చెరువులో కూడా కరోనా జన్యు పదార్థాలు కనిపించాయని..ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చెరువుల్లో ఈ జన్యు పదార్థాలు పెరగడం ప్రారంభమైందని అన్నారు. ఈ అధ్యయనాన్ని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ,సీసీఎంబీ సంయుక్తంగా నిర్వహించాయి. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయాల్లో ఈ అధ్యయనం చేశామని శాస్త్రవేత్తలు తెలిపారు. చెరువుల్లోని వైరస్ జన్యు పదార్థం మరింతగా విస్తరించలేదని.. కరోనా వైరస్ నీటి ద్వారా వ్యాపించదనే విషయం ఒక అధ్యయనంలో వెల్లడైందని కాస్త టెన్షన్ తగ్గించే వార్తను చెప్పారు.