హైదరాబాద్ నగరంలో చైనా మాంజా అమ్ముతున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వివిధ షాపుల్లో నాన్ బయో డీగ్రేడబుల్, సింథటిక్ ఉత్పత్తులతో తయారు చేసిన నిషేధిత చైనీస్ మాంజాను కలిగి ఉన్న 22 మందిపై నగర పోలీసులు 18 కేసులు నమోదు చేశారు. దుకాణదారుల వద్ద నుంచి సింథటిక్ ఉత్పత్తులతో తయారు చేసిన 1094 బాబిన్‌లు, బయో డీగ్రేడబుల్ కాని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. చైనీస్ మాంజాను విక్రయించవద్దని, ఎవరైనా నిబంధనలను పాటించకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు దుకాణదారులను ఆదేశించారు.
పోలీసులు మంగళ్‌హాట్ పరిసరాల్లోని దుకాణదారులతో అనేక సమావేశాలు నిర్వహించారు. మాంజా కొనుగోలు చేసే కస్టమర్లు గాలిపటాలు ఎగురవేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాంపౌండ్ వాల్స్ లేదా రెయిలింగ్ ఉన్న భవనాల నుంచి గాలిపటాలు ఎగురవేయాలని అధికారులు ప్రజలను కోరారు. మానవ ప్రాణాలకు, పక్షులకు, జంతువులకు హాని కలిగించకుండా ఉండటానికి చైనీస్ మాంజాను కొనుగోలు చేయవద్దని సూచించారు.