గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ప్రధాన కార్యాలయంలో గురువారం నాడు కాంట్రాక్టర్లు నిరసనలకు దిగారు. ఈ నిరసనల మధ్య ఇద్దరు వ్యక్తులు పెట్రోల్ పోసుకుని చనిపోడానికి ప్రయత్నించారు. జిహెచ్‌ఎంసి కి పనులు చేశామని, బిల్లులు చెల్లించకపోవడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని కాంట్రాక్టర్లు తెలిపారు.
ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఇద్దరు కాంట్రాక్టర్లను అక్కడే ఉన్న వ్యక్తులు రక్షించారు. వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. “నో పేమెంట్, నో వర్క్” అంటూ నినాదాలు చేస్తూ హైదరాబాద్‌లోని అన్ని సివిక్ మెయింటెనెన్స్ ప్రాజెక్ట్‌లను ఆపాలని డిమాండ్ చేశారు. కొందరు కాంట్రాక్టర్లు తమ బిల్లులు ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని వాపోయారు. తమ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కాంట్రాక్టర్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తికి వినతిపత్రం సమర్పించారు. దీనిపై ఇలంబర్తి స్పందిస్తూ పెండింగ్‌లో ఉన్న చెల్లింపులను క్లియర్ చేసేందుకు వచ్చే నెలలో రూ.200 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.