రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అలర్ట్ చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావులు కూడా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల కురిసే భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇంఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ చేశారు. వర్షాలపై జీహెచ్ఎంసీ, జిల్లా కలెక్టర్లు, హైడ్రా, విద్యుత్, పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో అధికారులకు సెలవులు రద్దు చేసి ఫీల్డ్‌లోనే పర్యవేక్షణ, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తీసుకుంటున్న చర్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు.