హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. బాలాపూర్‌లోని జల్‌పల్లిలో తన ఇంట్లో ఆన్ చేసిన ఎలక్ట్రిక్ వాటర్ హీటర్‌ను తాకడంతో కరెంట్ షాక్‌తో తీవ్రంగా గాయపడిన నాలుగేళ్ల బాలుడు చికిత్స పొందుతూ శుక్రవారం అర్థరాత్రి మృతి చెందాడు. బాధితుడు మహ్మద్ సుఫియాన్ జల్‌పల్లిలోని ఎర్రకుంటలో చిరువ్యాపారుడైన తన తల్లిదండ్రులు మొహమ్మద్ సిరాజుద్దీన్, ఉన్నిసా బేగంతో కలిసి ఉంటున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం సూఫియాన్ ఇంటి ముందు ఆడుకుంటుండగా ఆవరణలోని బాత్‌రూమ్‌లోకి వెళ్లి బకెట్ నీళ్లను వేడి చేసేందుకు ఆన్ చేసిన విద్యుత్ వాటర్ హీటర్‌ను తాకాడు.
సుఫియాన్ బకెట్‌లోని వాటర్ హీటర్‌ను తీసి ఇమ్మర్షన్ రాడ్‌ను తాకడంతో విద్యుత్ షాక్ తగిలిందని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. "తీవ్రమైన విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. బాత్రూమ్ నుండి అతని అరుపులు విన్న అతని కుటుంబ సభ్యులు అతనిని రక్షించేందుకు ప్రయత్నించి వెంటనే ఆసుపత్రికి తరలించారు, అక్కడ అతను మరణించాడు."అని ఒక అధికారి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన బాలాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శనివారం ఉస్మానియా జనరల్ ఆసుపత్రి మార్చురీలో శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.