వర్షాలు వచ్చినప్పుడు పలు కంపెనీలు తమ పారిశ్రామిక వ్యర్థాలను నీటి వనరులలోకి వదులుతూ ఉంటాయి. ముఖ్యంగా వికారాబాద్ నుండి నల్గొండ వరకు ప్రవహించే మూసీ నదిలోకి వదలడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఓ వైపు మూసీ నది పునరుజ్జీవనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు వేస్తున్నప్పటికీ, గృహ పారిశ్రామిక వ్యర్థాలను అక్రమంగా డంపింగ్ చేస్తున్నారు. దీంతో సరూర్‌నగర్ సరస్సులోకి కెమికల్స్ వస్తూ ఉన్నాయి.
ఏప్రిల్ 4, శుక్రవారం ఉదయం సరూర్‌నగర్ సరస్సులో తెల్లటి నురుగు కనిపించింది. మీర్‌పేట, జిల్లెలగూడ ప్రాంతాల నుండి ఉత్పత్తి అయ్యే గృహ, పారిశ్రామిక, రసాయన వ్యర్థాల కారణంగా మూసీ నది కలుషితమవుతోంది. వందలాది పరిశ్రమలు భూమి, నీరు, వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయి. గురువారం అంతటా కురిసిన అకాల వర్షం ఫలితంగా సరూర్‌నగర్ సరస్సులోకి పారిశ్రామిక, గృహ వ్యర్థాలు కలిశాయి.