దేవుడికి ప్రసాదంగా గంజాయి అంటూ రీల్స్ చేసిన యువకులు అరెస్ట్
శంషాబాద్ ధర్మగిరి టెంపుల్ వద్ద గంజాయి కలకలం రేపింది.
By - Medi Samrat |
శంషాబాద్ ధర్మగిరి టెంపుల్ వద్ద గంజాయి కలకలం రేపింది. కొంతమంది యువకులు గంజాయిని దేవుడికి నైవేద్యంగా పెట్టిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. చరణ్ అనే యువకుడితో పాటు అతని స్నేహితులు శివరాత్రి సందర్భంగా శివుడికి గంజాయిని నైవేద్యంగా పెట్టి అపచారానికి పాల్పడ్డారు. అలాగే ఈ వ్యవహారాన్నంతా వీడియో తీసి ఇంస్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అందరిలా కొబ్బరికాయ కొట్టడం కాకుండా మేము ప్రత్యేకంగా గంజాయి పెడుతున్నా మంటూ యువకులు చెప్పడం వీడియోలో చూడవచ్చు.
ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై హైదరాబాద్ సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.. యువకులు బడంగ్‌పేట్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఇలాంటి రీల్స్ పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. ఫలక్‌నుమా జంగమ్‌మెట్‌కు చెందిన సభావత్ శ్రీ చరణ్, వర్తేవత్ విజయ్ కృష్ణలను అరెస్ట్ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం వారిని ఫలక్‌నుమా పోలీసులకు అప్పగించారు. సోషల్ మీడియాలో వచ్చే లైకులు, వ్యూస్ మిమ్మల్ని కాపాడవు.. అవి కేవలం క్షణికానందం మాత్రమే.. కానీ చట్టం వేసే శిక్ష మాత్రం జీవితకాలం వెంటాడుతుంది అంటూ పోలీసులు హెచ్చరించారు.