సీఎం రేవంత్ నిర్ణయాలు దుర్మార్గమైనవి..ఆర్టీసీ ఛార్జీలపై కేటీఆర్ ఫైర్

హైదరాబాద్‌ లో ఆర్టీసీ ఛార్జీల పెంపుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు

By -  Knakam Karthik
Published on : 5 Oct 2025 2:40 PM IST

Telangana, TGSRTC, Brs Working President Ktr, CM Revanthreddy

సీఎం రేవంత్ నిర్ణయాలు దుర్మార్గమైనవి..ఆర్టీసీ ఛార్జీలపై కేటీఆర్ ఫైర్

హైదరాబాద్‌ లో ఆర్టీసీ ఛార్జీల పెంపుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సిటీ బస్సు చార్జీలను ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఒకేసారి 10 రూపాయలు పెంచి జంట నగరంలోని పేద మధ్యతరగతి ప్రయాణికుల జేబులను కొల్లగొట్టాలని చూస్తున్న రేవంత్ రెడ్డి నిర్ణయాలు దుర్మార్గమైనవి. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో అల్లాడుతున్న తరుణంలో.. ప్రతి ప్రయాణికుడిపై నెలకు 500 రూపాయల అదనపు భారం మోపితే బడుగుజీవులు ఎలా బతకాలో ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలి..అని కేటీఆర్ మండిపడ్డారు.

ఇప్పటికే విద్యార్థుల బస్ చార్జీలు, టీ-24 టిక్కెట్ చార్జీలను పెంచింది చాలదన్నట్టు.. ఇప్పుడు కనీస చార్జీపై కనికరం లేకుండా 50 శాతం టిక్కెట్టు ధరలను పెంచడం రేవంత్ అసమర్థ విధానాలకు నిదర్శనం. రాజధాని వాసుల నడ్డివిరిచి ప్రతినిత్యం దాదాపు కోటి రూపాయల భారం మోపాలని చూస్తున్న ముఖ్యమంత్రి హైదరాబాద్ ప్రజలపై కక్ష పెంచుకుంటున్నట్టు అర్థమవుతోంది. తుస్సుమన్న ఫ్రీ బస్సు పథకంతో దివాళా తీసిన ఆర్టీసిని గట్టెక్కించాల్సిందిపోయి, సామాన్య ప్రయాణికుల నడ్డి విరచాలని చూడటం క్షమించరానిది...అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Next Story