హైదరాబాద్ నగరం కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధి మూసాపేట్‌లో ఓ నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. వివాహం జరిగి మూడు నెలలు గడపకముందే నవవధువు బలవన్మరణానికి పాల్పడిన ఘటన రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. వివరాళ్లొకెళితే.. పొద్దుటూరుకు చెందిన జ్యోతికి కొత్తగూడెంకు చెందిన యశ్వంత్‌కు మూడు నెలల క్రితమే వివాహమైంది. యశ్వంత్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. దంపతులు మూసాపేట్‌లో నివాసం ఉంటున్నారు. అయితే ఇరువురి మధ్య గత కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో జ్యోతి తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ క్రమంలోనే జ్యోతి తన బెడ్రూంలోకి వెళ్లి తలుపులు వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త యశ్వంత్‌కు అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా అప్పటికే జ్యోతి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో భర్త యశ్వంత్ 108కి ఫోన్ చేసి జ్యోతిని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు.. హాస్పిటల్‌లో వైద్యులు జ్యోతిని పరీక్షించి అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారు. వివాహం చేసిన మూడు నెలలకే కూతురు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.